ఇంటర్ ఫలితాలపై కమిటీ : 3 రోజుల్లో నివేదికకు ఆదేశాలు

ఇంటర్ ఫలితాలపై కమిటీ : 3 రోజుల్లో నివేదికకు ఆదేశాలు

అధికారులతో సమీక్షలో విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి నిర్ణయం

హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విషయంలో వస్తున్న అపోహలపై రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఇవాళ రాష్ట్ర విద్యాశాఖా కార్యదర్శి జనార్దన్ రెడ్డితో పాటు ఇతర ఉన్నత అధికారులతో రివ్యూ జరిపారు. సమీక్షా తర్వాత మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఫలితాల విషయంలో అటు తల్లి తండ్రులు ఇటు విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన అన్నారు. .

కొంతమంది అధికారుల అంతర్గత తగాదాలతో ఈ అపోహలు సృష్టించబడినట్టుగా తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. అదే సమయంలో ఫలితాల విషయంలో వస్తున్న అపోహలను తొలగించడానికి  టి యస్ టి యస్ యండి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మరో ఇద్దరు విద్యా నిపుణులతో కమిటీ వేశామని మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. వెంటనే దర్యాప్తు జరిపి మూడు రోజులలో నివేదికను సమర్పించాలని అధికారులను అదేశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

వెంకటీశ్వర్ రావు తో పాటు  హైదరాబాద్ బిట్స్ కు చెందిన ప్రొఫెసర్ వాసన్ ఐఐటి హైదరాబాద్ కు చెందిన ప్రొఫెసర్ నిశాంత్ లు ఇందులో సభ్యులుగా ఉంటారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ప్రొఫెసర్ వాసన్ కు ఐటీ మీద స్పష్టమైన అవగాహన ఉందనీ.. ప్రొఫెసర్ నిశాంత్ పోటీ పరీక్షల నిర్వహణలో నిపుణుడని వివరించారు. ఫలితాల విషయంలో విద్యార్థులు, తల్లి తండ్రులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. ఫలితాల విషయంలో పొరపాట్లు జరిగినట్లు భావిస్తే రీకౌంటింగ్,రీ-వెరిఫికేషన్ లకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎటువంటి పొరపాటు జరిగినా సరిదిద్దుతామని చెప్పారు. ఏ ఒక్క విద్యార్థిని నష్టపోనివ్వమన్నారు.