జస్టిస్ కొండా మాధవ రెడ్డి పేరిట పోస్టల్ కవర్‌‌.. రిలీజ్​ చేసిన ఉపరాష్ట్రపతి

జస్టిస్ కొండా మాధవ రెడ్డి పేరిట పోస్టల్ కవర్‌‌..  రిలీజ్​ చేసిన ఉపరాష్ట్రపతి

జస్టిస్ కొండా మాధవ రెడ్డి జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్​ఖడ్ అన్నారు. మాధవరెడ్డి 100వ జయంతిని పురస్కరించుకొని, ఆయన గౌరవార్థం ప్రత్యేక పోస్టల్ కవర్‌‌ను హైదరాబాద్‌‌ గగన్‌‌మహల్‌‌లోని ఏవీ కాలేజీలో బుధవారం సాయంత్రం గవర్నర్ తమిళిసైతో కలిసి ఉప రాష్ట్రపతి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాధవరెడ్డి ఏపీ, ముంబై హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా, మహారాష్ట్ర గవర్నర్‌‌గా పని చేశారన్నారని తెలిపారు. ఆయన్ను కలిసే అదృష్టం తనకు లభించలేదని.. కానీ, ఆయన గురించి బాగా తెలుసన్నారు. ఎన్నో విద్య, సామాజిక, సాంస్కృతిక సంస్థలను స్థాపించారని తెలిపారు. యువ లాయర్లు పూర్తి సామర్థ్యంతో పని చేసేలా ప్రోత్సహించారని కొనియాడారు. వాయిస్ లేని వారికి ఒక వాయిస్ గా ఉన్నారని పేర్కొన్నారు. భారతదేశ పురోగతిని ప్రపంచం చూస్తోందని.. దీని ఫలితాలు మానవాళిలో ఆరో వంతు జీవితాలను ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. 

దశాబ్ద కాలంగా న్యాయవ్యవస్థ గణనీయమైన పురోగతి సాధించిందని.. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ ద్వారా డిజిటలైజేషన్‌‌తో పారదర్శకత, యాక్సెసిబిలిటీ మెరుగుపడి, పెండింగ్‌‌కేసుల తగ్గుదలకు దారితీసిందని ఉపరాష్ట్రపతి తెలిపారు. అనంతరం గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. మాధవరెడ్డి చీఫ్ జస్టిస్ గా, సమాజం కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. వృత్తి రీత్యా ఆయన చెప్పిన న్యాయం ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. ఈ పోస్టల్ కవర్ వచ్చే తరానికి మంచి బహుమతి అని తెలిపారు. జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కొండా మాధవరెడ్డి జీవిత సారాంశం, ఆయన రచనలు, విలువలు ఎనలేనివన్నారు. ఆయన జీవితం ప్రతిబింబించే మహత్తర సందర్భం ఇదేనని ఆనందం వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో హైకోర్టు చీఫ్​జస్టిస్ అలోక్ అరాధే, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి, తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ రాంచంద్రారెడ్డి, వీఆర్ రెడ్డి, జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్, పలువురు సిట్టింగ్, రిటైర్డ్ జడ్జిలు, న్యాయవాద సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.