
- అనారోగ్య కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి జగ్దీప్ ధన్ఖడ్ సోమవారం రాత్రి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామా లేఖను పంపారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు. తన పదవీకాలంలో తనకు అన్ని విధాలా మద్దతుగా ఉన్నందుకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి మండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అలాగే, పార్లమెంటు సభ్యులు చూపిన ఆదరణ ఎప్పటికీ తనకు మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందన్నారు. కాగా.. 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా ధన్ ఖడ్ ఎంపికయ్యారు. అంతకుముందు 1990-, 1991 మధ్య కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2019-- 22 వరకు బెంగాల్ గవర్నర్ గా సేవలు అందించారు. రాజీనామాకు ముందు పార్లమెంటు వర్షాకాల సమావేశానికి ముందు సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సభ్యులు భేషజాలకు పోకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలని కోరారు.
‘‘సభలో అదేపనిగా గందరగోళం సృష్టిస్తూ పోతే మంచి ప్రజాస్వామ్యం ఏర్పడదు. రాజకీయ ఉద్రిక్తతలను కచ్చితంగా తగ్గించాల్సిందే. అదేపనిగా గొడవపడడం రాజకీయాల సారం కాదు. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. సభలో వ్యక్తిగత దాడులు, అన్ పార్లమెంటరీ భాషకు దూరంగా ఉండాలి. పార్టీల మధ్య భావజాలాలు వేరైనా ఒకే లక్ష్యం కోసం పనిచేయాలి. జాతి ప్రయోజనాలను ఎవరూ కాదనరు. సంక్షోభంతో కాకుండా డైలాగ్, డిస్కషన్ తో ముందుకు వెళ్లాలి” అని ధన్ ఖడ్ పేర్కొన్నారు.