మా ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు ఒడిసిన ముచ్చట : జగదీశ్‌‌‌‌ రెడ్డి

మా ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు ఒడిసిన ముచ్చట :  జగదీశ్‌‌‌‌ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు ఒడిసిన కథ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌‌‌‌రెడ్డి అన్నారు. గత పదేండ్లలో జరిగిన రైతుల ఆత్మహత్యలను వదిలేయాలని, అది పాత ముచ్చట అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలోని మూడు నెలలకు సంబంధించిన నేషనల్‌‌‌‌ క్రైమ్‌‌‌‌ రికార్డ్స్‌‌‌‌ బ్యూరో (ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌బీ) లెక్కలను చెప్పాలని డిమాండ్ చేశారు.

మంగళవారం తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ కక్షపూరిత వైఖరి వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. రైతులకు సాగు నీళ్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కేపంట నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేశారు. కేసీఆర్ హయంలో చెక్ డ్యామ్‌‌‌‌లు నిర్మించి కాళేశ్వరం నీళ్లను అందించామన్నారు.

కేసీఆర్ ఇప్పుడు ఉండుంటే ఒక్క ఎకరం కూడా ఎండనిచ్చేవారు కాదన్నారు. కరీంనగర్‌‌‌‌కు కేసీఆర్ వస్తున్నారని తెలిసి గాయత్రి పంప్ ద్వారా నీళ్లను లిఫ్ట్ చేసి కాలువలకు వదిలారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి దానికి నోరు పారేసుకుని కేసీఆర్‌‌‌‌పై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని జగదీశ్‌‌‌‌ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌‌‌‌ వంద రోజుల పాలనలోనే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ విషయంపై మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్నడూ బాధ్యత తెలియదని విమర్శించారు. రాష్ట్రంలో 100 రోజుల్లోనే 2014 కంటే ముందు పరిస్థితులు వచ్చాయన్నారు. అంతకుముందు పంట నష్టంపై జగదీశ్‌‌‌‌ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు సీఎస్‌‌‌‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ‌‌‌‌లు సత్యవతి రాథోడ్, శేరి సుభాశ్‌‌‌‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.