మునుగోడులో గెలిపించినందుకు థ్యాంక్స్​

మునుగోడులో గెలిపించినందుకు థ్యాంక్స్​
  • కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తం: మంత్రి జగదీశ్​రెడ్డి 

  • ఎమెల్యే కూసుకుంట్లతో కలిసి సీపీఎం, సీపీఐ ఆఫీసులకు

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో గెలిపించినందుకు సీపీఎం, సీపీఐ రాష్ట్ర నేతలు, ఆయా పార్టీల కార్యకర్తలకు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి కృతజత్ఞలు చెప్పారు. భవిష్యత్​లోనూ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. సీపీఎం, సీపీఐ మద్దతుతో మునుగోడు బైపోల్​లో టీఆర్ఎస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్, ఎమ్మెల్సీ రవీందర్ రావుతో కలిసి సీపీఎం, సీపీఐ ఆఫీసులకు వెళ్లి ఆయా పార్టీల రాష్ట్ర నేతలను మర్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో మతతత్వ శక్తులను నిలువరిచేందుకు ప్రగతిశీల శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో సజావుగా సాగుతున్న పరిపాలనకు ఆటంకాలు సృష్టించి, అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఇందులో భాగంగా ఉపఎన్నిక తెచ్చి రాష్ట్రంలో అలజడి సృష్టించే యత్నం చేశారని చెప్పారు. దేశంలో బీజేపీ మళ్లీ గెలిస్తే మధ్యయుగాల నాటి పరిస్థితులకు తీసుకెళ్తుందన్నారు.

ఎమ్మెల్యేలను కొనడం, ప్రభుత్వాలను కూల్చడం బీజేపీ చేస్తుందని, ఆ పార్టీ నుంచి దేశానికి విముక్తి కల్పించాలని కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... దేశంలో పరిస్థితి మోడీ, అమిత్ షా.. వారికిద్దరు అంబానీ, అదానీ అనే రకంగా మారిపోయిందన్నారు. ఏడాది కింద ప్రారంభమైన రామగుండం ఎరువుల పరిశ్రమను ప్రధాని మోడీ మళ్లీ ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు. ఈ నెల 12న మోడీ పర్యటన సందర్భంగా నిరసనలు తెలుపుతామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ... రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో బీజేపీ వాసనే లేదన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రజాసమస్యలను సాధ్యమైంత త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, సీపీఎం నేతలు చెరుపల్లి సీతారాములు, నాగయ్య, జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.