అన్ని ప్రధాన ఆలయాల్లో బెల్లం లడ్డూలు

అన్ని ప్రధాన ఆలయాల్లో బెల్లం లడ్డూలు
  • యాదాద్రి భవన్ ప్రారంభోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
  • ఆలయాలన్నింటా ఆన్ లైన్ సేవలు
  • దేవాలయాల్లో సే వల సమాచారం కోసం ప్రత్యేక యాప్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో త్వరలో ఆన్ లైన్ సేవలను ప్రారంభిస్తామని, బెల్లం లడ్డూలు విక్రయిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఏడు ప్రధాన ఆలయాల్లో ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. మొబైల్లో దేవాలయాల సమాచారం, సేవలు పొందేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్​లోని బర్కత్ పురలో రూ.8.12 కోట్లతో నిర్మించిన యాదాద్రి భవన్ (సమాచార కేంద్రం)ను శాసన మండలి డిప్యూటీ చైర్మన్​ నేతి విద్యాసాగర్, మంత్రులు జగదీశ్​రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్​లతో కలిసి ఇంద్రకరణ్​ ప్రారంభించారు. ఆలయాల్లో సేవల వివరాలు తెలిపే మొబైల్ యాప్ ను విడుదల చేసి, బెల్లం లడ్డూ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు.

యాదాద్రి భవన్ లోని సమాచార కేంద్రం ద్వారా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆర్జిత సేవలు, కల్యాణం టికెట్లు, గదులు బుకింగ్  చేసుకునేలా ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. స్వామివారి కల్యాణం, ఇతర వేడుకలు నిర్వహించేందుకు వీలుగా యాదాద్రి భవన్​ మొదటి అంతస్తులో కల్యాణ మండపం నిర్మించామని చెప్పారు. యాదాద్రిలో దేవాలయ విస్తరణ పనులు త్వరలో పూర్తి కానున్నాయన్నారు. భక్తుల కోరిక మేరకు యాదాద్రిలో బెల్లం లడ్డూలను అందుబాటులోకి తెచ్చామని, అన్ని ప్రధాన ఆలయాల్లో దీనిని అమలు చేస్తామని తెలిపారు. తర్వాత కల్యాణ మండపంలో నిర్వహించిన లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణంలో మంత్రులు పాల్గొన్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటేశ్, దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్, యాదాద్రి ఈవో గీతారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణచారి, పలువురు నేతలు పాల్గొన్నారు.