ఎమ్మెల్యే వేధిస్తుండని మున్సిపల్ ఛైర్ పర్సన్ రాజీనామా

ఎమ్మెల్యే వేధిస్తుండని మున్సిపల్ ఛైర్ పర్సన్ రాజీనామా

జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ పదవికి బోగ శ్రావణి రాజీనామా చేశారు. మీడియా ముందు కంటతడి పెట్టిన ఆమె.. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ మహిళ ఎదగడం చూసి ఓర్వలేక ప్రతి తప్పుకు తనని బాధ్యుల్ని చేశారని శ్రావణి ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలర్లను సైతం ఎమ్మెల్యే  సంజయ్ టార్చర్ చేశాడని ఆమె ఆరోపించారు. తనకు చెప్పకుండా  ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టొద్దని ఎమ్మెల్యే హుకుం జారీ చేశాడని, తన పదవితో పోలిస్తే మున్సిపల్ చైర్మన్ పదవి చాలా చిన్నది అంటూ చాలాసార్లు  సంజయ్ అవమానించాడని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నా అభివృద్ధే లక్ష్యంగా తాను ముందుకు వెళ్ళానని శ్రావణి చెప్పారు. 

పేరుకే తాను మున్సిపల్ చైర్మన్ నని పెత్తనమంతా ఎమ్మెల్యేనే చలాయించేవాడని శ్రావణి ఆరోపించారు. పార్టీ కోసం పనిచేస్తున్నా కక్షగట్టి ఇబ్బందులకు గురిచేశారని అన్నారు.  ఎమ్మెల్సీ కవితను కలవకూడదని, కేటీఆర్ పేరు ప్రస్తావించకూడదని సంజయ్ కుమార్ హెచ్చరించారని శ్రావణి అన్నారు.  ఎమ్మెల్యే నుంచి తమకు ఆపద ఉందన్న శ్రావణి తన కుటుంబానికి ఏమైనా జరిగితే అందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారణమని చెప్పారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరారు.