కారుణ్య మరణానికి అనుమతివ్వండి.. జగిత్యాల ప్రజావాణిలో ఆఫీసర్లను వేడుకున్న వృద్ధురాలు

కారుణ్య మరణానికి అనుమతివ్వండి.. జగిత్యాల ప్రజావాణిలో ఆఫీసర్లను వేడుకున్న వృద్ధురాలు

జగిత్యాల రూరల్, వెలుగు : ‘మూడో కూతురు  వేధిస్తుండండతో నాకు బతకాలన్న ఆశ లేదు, కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి’ అంటు ఓ వృద్ధురాలు ప్రజావాణిలో ఆఫీసర్లను వేడుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కోనాపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామానికి చెందిన ఎండ్రికాయల గంగవ్వ (80) భర్త చనిపోవడంతో కారుణ్య నియామకం కింద మూడో కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. 

కూతురు తనను మానసికంగా వేధిస్తోందని, తన వద్ద ఉన్న రూ. 9 లక్షలు, మూడు తులాల బంగారం తీసుకుని వెళ్లిపోయిందని ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల తిరిగి వచ్చి తాళాలు పగులగొట్టి ఇంటిని ఆక్రమించుకుందని, ప్రశ్నిస్తే చంపేస్తానని బెదిరిస్తోందని ఆరోపించింది. ప్రస్తుతం పెద్ద కుమార్తె వద్ద ఆశ్రయం పొందుతున్నానని తెలిపింది. 

న్యాయం కోసం పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్లు, ఆర్డీవో ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోయింది. వృద్ధాప్యంలో రోగాలతో బాధపడుతున్నందున ఇక తనకు బతకాలని లేదని, దయచేసి చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని వేడుకుంది. స్పందించిన ఆఫీసర్లు.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.