అక్టోబర్ 27 నుంచి జాగో తెలంగాణ యాత్ర

అక్టోబర్ 27 నుంచి జాగో తెలంగాణ యాత్ర

హైదరాబాద్, వెలుగు : జాగో తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక (టీఎస్ డీ ఎఫ్ ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఓటర్ల చైతన్య యాత్ర శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని జాగో తెలంగాణ కన్వీనర్ ఆకునూరు మురళి తెలిపారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్​లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద జస్టిస్ బి.చంద్రకుమార్ జెండా ఊపి యాత్రను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఈ టూర్ కు పర్మిషన్ ఇవ్వాలని ఇటీవల సీఈవో వికాస్ రాజ్ కు మురళి వినతిపత్రం అందజేశారు. అయితే, పర్మిషన్ అవసరం లేదని సీఈవో హామీ ఇచ్చారని మురళి వెల్లడించారు. ఈ యాత్రలో రెండు వేదికల ప్రతినిధులు పాల్గొంటారని గురువారం ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు.

 ‘మత విద్వేష, అవినీతి, నియంతృత్వ, దోపిడీ పాలనను ఓడించండి’ అనే పిలుపుతో ఈ యాత్ర రాష్ట్రంలోని 37 నియోజకవర్గాల్లో  కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. శుక్రవారం తుంగతుర్తి నియోజకవర్గంలో మూడు కార్నర్ మీటింగ్స్, 28న ఉదయం సూర్యాపేటలో మూడు సమావేశాలు, మధ్యాహ్నం కోదాడలో మూడు సమావేశాలు ఉంటాయని, 29న ఉదయం హుజూర్ నగర్ లో మూడు సమావేశాలు, మధ్యాహ్నం మిర్యాలగూడలో మూడు సమావేశాలు, 30న ఉదయం నల్గొండలో మూడు సమావేశాలు జరుగుతాయన్నారు. రెండో విడత సమావేశాలు నవంబర్​2వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయని మురళి తెలిపారు. 

కాళేశ్వరంను ఇప్పటికైనా మూసేస్తే.. లక్ష కోట్లు కాపాడుకోవచ్చు

కాళేశ్వరం ప్రాజెక్టును ఇప్పటికైనా మూసేస్తే.. రూ.లక్ష కోట్లు కాపాడుకోవచ్చని ఆకునూరు మురళి అన్నారు. మేడిగడ్డ రిజర్వాయర్​ పిల్లర్లు కుంగిపోవడంపై ఆయన గురువారం ట్విట్టర్​లో స్పందించారు. ‘గత ఆరేండ్ల నుంచి చెప్తున్నా.  కేసీఆర్​ అహంకార, అవినీతి వైఖరి వల్ల లక్ష కోట్ల రూపాయలు నష్టం. ఇప్పటికైనా మూసేస్తే ఇంకో రూ.లక్ష కోట్లు కాపాడుకోవచ్చు. కాగ్​ ప్రకారం ఇంకా రూ.52 వేల కోట్లు ఖర్చుపెడితేనే ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. రూ.25 వేల పంటకు లక్ష ఖర్చు. 36 లక్షల ఎకరాలు అని.. లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వడం లేదు’ అని ఆయన ట్వీట్​ చేశారు.