- బీఆర్ఎస్ పట్టించుకోలే.. మీరన్నా చేయండి: కవిత
- తెలంగాణ జాగృతి ఫౌండర్ కల్వకుంట్ల కవిత
- వరంగల్‌లో గుడిసెవాసులకు ఇండ్లు కట్టించాలని సీఎంకు సూచన
వరంగల్, వెలుగు: ‘గ్రేటర్ వరంగల్‌లో పేదలు 25 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని ఉంటున్నారు.. వారికి బీఆర్‍ఎస్ హయాంలో ఏమీ చేయలేకపోయాం.. సీఎం రేవంత్‍రెడ్డి వారికి పక్కా ఇండ్లు కట్టిస్తామని మాటిచ్చారు.. ఆ హామీ నెరవేర్చుకోండి’ అని తెలంగాణ జాగృతి ఫౌండర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. జాగృతి జనం బాట రెండ్రోజుల కార్యక్రమంలో భాగంగా ఆమె శుక్రవారం జిల్లాలో పర్యటించారు. మొంథా తుఫాన్ ప్రభావానికి మునిగిన సమ్మయ్యనగర్‍లో బాధితులను పరామర్శించారు. అనంతరం ఎంజీఎం హాస్పిటల్‌ను సందర్శించారు. పేషెంట్లతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంజీఎంలో బేసిక్ మందులు, టెస్టులకు కెమికల్స్ లేవని ఆరోపించారు. టెస్టుల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లాల్సి వస్తోందన్నారు. జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఎంజీఎంను విజిట్ చేసి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో సీఎం రేవంతరెడ్డి 2025లో పాత, కొత్త బకాయిలు అందిస్తామని కౌన్సిల్‍లో ప్రకటించారని.. మాట తప్పడంతోనే వారు యాజమాన్యాలు బంద్‍కు వెళ్లాయన్నారు.
వారి తాటా తీస్తా.. తోలు తీస్తానని సీఎం బెదిరించడం ఆయన హోదాకు సరికాదన్నారు. వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపే కాలేజీలకు పర్మిషన్లు ఇవ్వొద్దన్నారు. అనంతరం ఆమె నర్సంపేట మండలంలో పర్యటించారు. నర్సంపేటలోని అమరుల స్మారక స్తూపం వద్ద నివాళులర్పించారు. మాధన్నపేట శివాలయంలో పూజలు చేశారు. పరకాల సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో సూసైడ్ చేసుకున్న ఏకు శ్రీవాణి కుటుంబసభ్యులను పరామర్శించారు.
