జగిత్యాల జిల్లా కోర్టు కీలక తీర్పు.. గంజాయి నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష

జగిత్యాల జిల్లా కోర్టు కీలక తీర్పు.. గంజాయి నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష

గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై జగిత్యాల జిల్లా న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. మత్తు పదార్థాల సరఫరాకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. జగిత్యాల 1వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి జి. సునీత రవీంద్ర రెడ్డి ఈ మేరకు తీర్పును ప్రకటించారు.

కేసు వివరాల్లోకి వెళితే.. 2021 ఫిబ్రవరి 18న కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆటోలో అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి ఏకంగా 16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని ఈస్ట్ గోదావరి జిల్లా, డోంకరాయి గ్రామానికి చెందిన కుల్దీప్ రవికుమార్, మరియు పాంగి లైకస్‌లుగా గుర్తించారు.

పోలీసులు కోర్టులో సమర్పించిన పక్కా సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయమూర్తి నిందితులను దోషులుగా తేల్చారు. ఇద్దరు నిందితులకు చెరి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు, ఒక్కొక్కరికి 10 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

ఈ తీర్పుపై జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్పందించారు. జిల్లాలో గంజాయి రవాణా చేసినా, సరఫరా చేసినా ఎంతటి వారైనా సరే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని, భవిష్యత్తులో కూడా ఇలాంటి శిక్షలు పడేలా పకడ్బందీగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.