అమ్మో.. గురుకులం .. అర్ధాకలితో విద్యార్థుల చదువులు

అమ్మో.. గురుకులం .. అర్ధాకలితో విద్యార్థుల చదువులు
  • అన్నంలో పురుగులు, రాళ్లు
  • 1,290 మందికి 30 టాయిలెట్సే
  • వాటికి డోర్లు ఉండవు.. నల్లాల నుంచి నీళ్లూ రావు 
  • ఒకటి, రెండుకు వెళ్లాలంటే గోడకు నిచ్చెన వేయాల్సిందే
  • అర్ధరాత్రి టాయిలెట్ వస్తే ఉగ్గపట్టాలి

పేదింటి పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. అయితే, కనీస వసతులు కల్పించకపోవడంతో గురుకులం ప్రస్తుతం సమస్యలతో సతమతమవుతోంది. ఫలితంగా ఇబ్బందులు తాళలేక విద్యార్థులు ఇంటి దారి పడుతున్నారు.

కౌడిపల్లి, వెలుగు : మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలోని మహాత్మా జ్యోతిబా పూలే బాయ్స్ రెసిడెన్షియల్​ విద్యాలయం ​పదో తరగతి నుంచి డిగ్రీ వరకు కొనసాగుతోంది. ఐదు నుంచి పదో తరగతి వరకు 700 మంది, ఇంటర్మీడియట్, డిగ్రీ కలిపి 450 మంది ఉండగా, కొత్తగా ఈ ఏడాది పదో తరగతిలో 40 మంది, ఇంటర్మీడియట్​లో వంద మంది స్టూడెంట్స్ చేరారు. ఈ క్యాంపస్ లో రెండు స్కూల్స్, మూడు జూనియర్ కాలేజీలు, ఒక డిగ్రీ కాలేజీ నడుస్తుండగా, మొత్తం 1,290 మంది విద్యార్థులకు 34 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. 

ఒకటి, రెండుకు గోడ దూకాల్సిందే

ఇంత మంది మంది విద్యార్థులు ఉన్న ఈ క్యాంపస్​లో కేవలం 30 టాయిలెట్స్​ మాత్రమే ఉన్నాయి. వాటిల్లో క్లాస్ రూమ్ పక్కనే ఉన్న టాయిలెట్లకు నీటి సరఫరా లేకపోవడంతో ఎవరూ వెళ్లకుండా అడ్డుగా బెంచీలు పెట్టారు. మరో 15 బాత్ రూమ్​లు పడుకునే చోట ఉండగా, నీటి సరఫరా లేకపోవడంతోపాటు తలుపులు, నల్లాలు, టైల్స్  ధ్వంసమై ఓపెన్ గా ఉండడంతో ముక్కుపూటలు అదిరే దుర్గంధం వస్తోంది. దీంతో విద్యార్థులు రాత్రి, ఉదయం సమయంలో పాఠశాల వెనకాల ఉన్న గోడకు నిచ్చెన ఏర్పాటు చేసుకొని గోడ దూకి ఒకటి, రెండుకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.   

ఆరుబయటే స్నానాలు

ప్రతిరోజు విద్యార్థులు స్నానాలు చేయాలంటే బాత్ రూమ్​లు సరిపడ లేక ఇబ్బందులు పడుతున్నారు.  ఐదు గంటలకే లేచి స్కూల్​ గ్రౌండ్​లోనే సంపులోని నీళ్లతో స్నానం చేస్తున్నారు. చిన్న తరగతుల పిల్లలు చలిలో ఆరుబయట తెల్లవారుజామున స్నానం చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. బట్టలు ఉతకడానికి ప్రత్యేక చోటంటూ లేకపోవడంతో అక్కడే పిండుకుంటున్నారు.

అన్నం తినలేక పస్తులు..

ప్రతిరోజు మధ్యాహ్నం వడ్డించే  అన్నంలో పురుగులు,  రాళ్లు వస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆ అన్నం తినలేక పస్తులు ఉంటున్నామని చెబుతున్నారు. చేసేది లేక ఇంటి నుంచి తెచ్చుకున్న బిస్కెట్లు తిని అర్ధాకలితోనే ఉంటున్నామని కన్నీళ్లు దిగమింగుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు పెట్టగా మిగిలిన అన్నం ప్రహరీ గోడ పక్కనే పడేయడంతో పెంట కుప్పలా తయారైంది. దీంతో దుర్గంధంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. 

బాత్ రూమ్స్ లేక బయటకు 

క్యాంపస్​లోని బాత్ రూములకు డోర్లు లేవు. నల్లాలు పనిచేయక కంపు వాసన వస్తోంది. దీంతో ఒకటి, రెండుకు గోడ దూకి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి వస్తున్నాం. రాత్రిపూట అయితే ఎవరికి చెప్పాలో తెలుస్తలేదు. టాయిలెట్స్ వస్తే ఆపుకోవలసి వస్తుంది.

 వంశీ, స్టూడెంట్​, నాగర్​ కర్నూల్ జిల్లా

అన్నం తినాలనిపిస్తలేదు

అన్నంలో రోజు తినేటప్పుడు పురుగులు, రాళ్లు వస్తున్నాయి. తినలేక పెట్టిన అన్నం పారబోసి ఇంటి నుంచి తెచ్చుకున్న బిస్కెట్లు, అటుకులు తిని ఉంటున్నాం. రోజు ఇట్లనే అయితుంది.  బాగలేని అన్నం తినాలనిపిస్తలేదు. రాత్రిపూట పడుకునేందుకు బెడ్ షీట్లు లేవు. మంచాల కిందకు జెర్రీలు వస్తున్నాయి. నిద్ర పోవాలంటే భయమేస్తుంది.  

మహేష్, స్టూడెంట్, వనపర్తి జిల్లా 

ఇంత ఘోరంగా ఉంటదనుకోలే

హాస్టల్ ఇంత ఘోరంగా ఉంటదనుకోలేదు. ఇలా అనుకుంటే మా ఊర్లోనే ఉన్న గవర్నమెంట్ స్కూల్​లోనే వేసే వాన్ని. బయటకు పంపిస్తే బాగా చదువుకొని ఏదో సాధిస్తాడు అనుకుంటే ఇక్కడ తినకుండా అవస్థలు పడుతూ నరకం అనుభవిస్తున్నాడు.

పాండరి గౌడ్, పేరెంట్,  కొత్తపేట

కొత్తగా వచ్చాను

మూత్రశాలల ఇబ్బంది వాస్తవమే. కానీ, నేను వచ్చి రెండు రోజులే అవుతుంది. హాస్టల్ సమస్యలపై విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బందితో చర్చిస్తాను. విద్యార్థులకు మంచి చదువుతోపాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తా. - హరిబాబు, ప్రిన్సిపాల్