లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన ఎస్ఐ

V6 Velugu Posted on Jun 17, 2021

  • రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుపడిన జగిత్యాల టౌన్ ఎస్.ఐ శివకృష్ణ

జగిత్యాల జిల్లా: కంచె చేను మేసింది. అవినీతి, అన్యాయాలను రూపుమాపాల్సిన పోలీసు అధికారే అన్యాయానికి దిగి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుపడ్డాడు. జగిత్యాల పట్టణంలో గురువారం జరిగిన ఏసీబీ దాడి ఘటన సంచలనం సృష్టించింది. జగిత్యాల టౌన్ ఎస్ఐ శివకృష్ణ  30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడిన వైనం పోలీసు శాఖలో కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.
భార్యా భర్తల కుటుంబ కలహాల విషయంలో స్టేషన్ బెయిల్ కు సంబంధించి ఎస్సై శివకృష్ణ 50 వేలు లంచం డిమాండ్ చేశారు. తాము అంత  డబ్బు ఇచ్చుకోలేమంటే పట్టించుకోలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక రాజేష్ అనే బాధిత వర్గానికి చెందిన వ్యక్తి కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలియజేశాడు. ఏసీబీ అధికారులు అభయం ఇచ్చారు. ఈలోగా ఎస్.ఐ శివకృష్ణ ఓ మెట్టు దిగి 30 వేలు ఇవ్వమని అడిగారు, ఈ విషయం రాజేష్ వెంటనే ఏసీబీ అధికారులకు తెలియజేయగా.. వారిచ్చిన రూ.30 వేలు తీసుకుని జగిత్యాలకు వచ్చాడు. గురువారం రూ.30 వేలు లంచం డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కరీంనగర్ డీఎస్పీ భద్రయ్య నేతృత్వంలో ఏసీబీ అధికారులు ఎస్.ఐ శివకృష్ణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 
శివకృష్ణ ఇటీవలే బదిలీపై జగిత్యాలకు వచ్చారు. ఇంతకుముందు కొడిమ్యాలలో పనిచేస్తున్నప్పుడు ఇదే తరహాలో వివాదాస్పదంగా వ్యవహరించడంతో స్థానికంగా దుమారం చెలరేగి వివాదాస్పద రీతిలో బదిలీ అయ్యాడు. జగిత్యాలకు వచ్చినా తన ధోరణి మార్చుకోలేదు. ముగిసిన కేసులో మళ్లీ బాధితులను పిలిపించి బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఇవాళ ఏసీబీకి పట్టుపడం హాట్ టాపిక్ అయింది. 

Tagged , jagtial today, town SI shiva krishna, ACB raids on jagityal, taking bribe rs 30000, karimnagar acb, acb dsp bhadryayya, wife and husband issue

Latest Videos

Subscribe Now

More News