ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన హరీష్ రావు విచారణ.. 7 గంటల పాటు ప్రశ్నల వర్షం..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన హరీష్ రావు విచారణ.. 7 గంటల పాటు ప్రశ్నల వర్షం..!

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‎లో దాదాపు 7 గంటల పాటు సిట్ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. హరీష్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. విచారణ ముగిసిన తర్వాత జూబ్లీహిల్స్ పీఎస్ నుంచి నేరుగా ఆయన తెలంగాణ భవన్‎కు బయలుదేరారు. తెలంగాణ భవన్‎లో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని సోమవారం (జనవరి 19) హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సిట్ నోటీసుల మేరకు మంగళవారం (జనవరి 20) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌‌‌‌లోని సిట్ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరయ్యారు. సిట్ చీఫ్ సజ్జనార్ నేతృత్వంలో దాదాపు ఏడు గంటల పాటు అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీ పాత్ర ఏంటి..? ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయించారని సిట్ ఆయనను ప్రశ్నించినట్లు సమాచారం. 

Also Read : హైదరాబాద్ లో మూతపడ్డ బిస్కెట్ల కంపెనీ

సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే హరీశ్ రావును సిట్‌‌‌‌ విచారిస్తున్నట్టు తెలిసింది. చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హరీశ్ రావు అనుచరులను పంజాగుట్ట పోలీసులు గతంలోనే అరెస్ట్ చేశారు. సిట్ కూడా వారి స్టేట్‌‌‌‌మెంట్లు రికార్డ్ చేసినట్టు తెలిసింది. ఐ న్యూస్ మాజీ ఎండీ శ్రవణ్ రావుతో కలిసి హరీశ్ రావు ఫోన్ ట్యాపింగ్‌‌‌‌కు పాల్పడినట్టు సిట్ ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే హరీశ్ రావుకు నోటీసులు జారీ చేసింది. 

కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా నిందితులైన మాజీ పోలీస్ అధికారుల వాంగ్మూలాలు, టెలికం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అందిన 618 నంబర్లకు చెందిన ఫోన్ ట్యాపింగ్ లిస్ట్ ఆధారంగా సిట్ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్‌‌‌‌ను ఇప్పటికే విచారించింది. వాళ్ల నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు సహా వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ వివరాలు సేకరించింది.