మెడికల్ హబ్‌‌‌‌గా జగిత్యాల : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మెడికల్ హబ్‌‌‌‌గా జగిత్యాల : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  •     మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  •     రూ.235 కోట్లతో 450 బెడ్స్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు శంకుస్థాపన 

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా భవిష్యత్‌‌‌‌లో మెడికల్ హబ్‌‌‌‌గా మారబోతుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగులు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాకేంద్రంలో మంగళవారం రూ.235 కోట్లతో నిర్మించనున్న 450 బెడ్స్‌‌‌‌ ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌కు శంకుస్థాపన చేసి, రూ.23.5 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ బిల్డింగ్‌‌‌‌ను కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌‌‌‌తో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాతా-శిశు ఆరోగ్య కేంద్రం, మెడికల్ కాలేజీ సమీపంలో నిర్మించనున్న ఈ హాస్పిటల్‌‌‌‌తో జగిత్యాల జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు కూడా నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. రూ.3 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌‌‌‌ను కూడా ప్రారంభించినట్లు చెప్పారు. 

ఎమ్మెల్యే మాట్లాడుతూ నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీకి 150 బెడ్స్ హాస్పిటల్ అవసరం కాగా 450 బెడ్స్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌ను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మెడికల్ కాలేజీ పనులు వేగంగా సాగుతున్నాయని, అవసరమైన వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ఇప్పటికే అనుమతులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సునీల్‌‌‌‌కుమాఱ్​, డీఎంహెచ్‌‌‌‌వో సుజాత, అధికారులు, వైద్య సిబ్బంది, మెడికోలు, పాల్గొన్నారు.