జై మహాభారత్ పార్టీ కార్యకర్తలు హైదరాబాద్లోని సైఫాబాద్ పోలీసు స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. తమ పార్టీ అధ్యక్షుడు అనంత విష్ణు ప్రభుపై కేసు నమోదు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనపై ఇటీవలి పోలీసులు పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటూ మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారికి నచ్చజెప్పేందుకు సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర ప్రయత్నించారు. ఈనేపథ్యంలో పోలీసు స్టేషన్ పరిసరాల్లో పోలీసులను మోహరించారు. కాగా, ‘జై మహాభారత్’ పార్టీలో సభ్యత్వం తీసుకుంటే ఇండ్ల స్థలాలు ఇప్పిస్తానంటూ 5 లక్షల ఆధార్ కార్డులు సేకరించిన భగవాన్ అనంత విష్ణు ప్రభు అలియాస్ రామ్ దాస్ పై సైఫాబాద్ పీఎస్ లో జులై 7న కేసు నమోదైంది. పబ్లిక్ న్యూ సెన్స్, చీటింగ్, రోడ్ అబ్స్ట్రాక్షన్ అభియోగాలతో ఐపీసీ 420, 290,341 సెక్షన్ల కింద కేసు పెట్టారు. పార్టీ రిజిస్ట్రేషన్ పై సైఫాబాద్ పోలీసులు ఎన్నికల సంఘాని (ఈసీ)కి లేఖ రాశారు. భారీ ఎత్తున ఆధార్‌కార్డులు సేకరించారంటూ ఫిర్యాదు చేశారు. ఆధార్ కార్డును సమర్పించి జైమహాభారత్ పార్టీ సభ్యత్వం తీసుకునే వారికి .. 200 గజాల ఇళ్ల స్థలం ఇస్తానని రామ్‌దాస్ ప్రజలను నమ్మించినట్లు పేర్కొన్నారు.
