మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటే జైలే

మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటే జైలే
  • నాన్​బెయిలబుల్​ కేసులు బుక్ చేస్తున్న పోలీసులు
  • మంచిర్యాలలో మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్న బీజేవైఎం లీడర్లపై కేసులు
  • సంతాకాలు తీసుకొని పంపుతామని కోర్టుకు.. బెయిలిచ్చిన కోర్టు
  • పోలీసుల తీరుకు నిరసనగా స్టేషన్ ముందు ధర్నా

మంచిర్యాల, వెలుగు: ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని మంత్రులు, రూలింగ్​ పార్టీ  ఎమ్మెల్యేల కాన్వాయ్​లను అడ్డుకుంటే జైలుకు వెళ్లాల్సిందే. ఎందుకంటే ఇప్పటివరకు ఆందోళనకారులను అరెస్ట్​ చేసి బెయిలబుల్​సెక్షన్ల కింద కేసులు పెట్టిన పోలీసులు ప్రస్తుతం నాన్​ బెయిలబుల్​ కేసులు బుక్​ చేస్తున్నారు. మూడు రోజుల కింద మంచిర్యాలలో ఆర్అండ్​బీ మినిస్టర్​ వేముల ప్రశాంత్​రెడ్డి కాన్వాయ్​ను అడ్డుకున్నందుకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సహా 11 మంది లీడర్లపై పోలీసులు నాన్​ బెయిలబుల్​ కేసులు ఫైల్​చేశారు. సంతకాల కోసం స్టేషన్​కు రావాలని పిలిచి వారిని అరెస్ట్​ చేసి కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. అయితే వారికి మేజిస్ర్టేట్ ​బెయిల్ శాంక్షన్​ చేశారు.

ఉద్యోగాలు భర్తీ చేయాలన్నందుకు... 
ఆర్అండ్​బీ మినిస్టర్​ వేముల ప్రశాంత్​రెడ్డి ఈ నెల 1న మంచిర్యాలలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్​ కాలేజీ పనులను పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ర్టంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఐబీ చౌరస్తాలో నినాదాలు చేస్తూ మంత్రి కాన్వాయ్​కు అడ్డుగా వెళ్లారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని స్టేషన్​కు తరలించి సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. 

ఐదు నిమిషాల్లోనే పంపుతామని అరెస్ట్​  
మంత్రి కాన్వాయ్​ను అడ్డుకున్నారంటూ పోలీసులు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణ, టౌన్​ ప్రెసిడెంట్​ రాచకొండ సత్యనారాయణ, శానగొండ రాజేందర్​, ఎం.సుమన్​యాదవ్​, కుర్రె చక్రవర్తి, పల్లి రాకేశ్​, కొత్త శివమణి, ఠాకూర్​ తరుణ్​, సింగరవేని శివకుమార్​, అరెందుల రాజేశ్​, అమిరిశెట్టి రాజ్​కుమార్​లపై ఐపీసీ 143, 149, 341 సెక్షన్లతో పాటు 353 నాన్​బెయిలబుల్​ సెక్షన్​ కింద కేసులు ఫైల్​ చేశారు. ఈ విషయాన్ని సీక్రెట్​గా ఉంచారు. గురువారం ఉదయం ఎస్సై కిరణ్​, సీఐ నారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావుకు ఫోన్​ చేసి మంత్రి కాన్వాయ్​ను అడ్డుకున్న ఘటనలో బీజేవైఎం లీడర్లపై కేసు ఫైల్​ చేశామని, ఐదు నిమిషాల్లో స్టేషన్​ కు వస్తే బెయిల్ ఇచ్చి పంపిస్తామని, మిగతావాళ్లను తీసుకొని రావాలని కోరారు. దీంతో రఘునాథ్​రావు మధ్యాహ్నం 2గంటలకు అందుబాటులో ఉన్న పట్టి వెంకటకృష్ణ, రాచకొండ సత్యనారాయణ, కుర్రె చక్రవర్తి, పల్లి రాకేశ్, కొత్త శివమణి, అమిరిశెట్టి రాజ్​కుమార్​లను పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లారు. బీజేపీ లీడర్లు బయట మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా అందరినీ బలవంతంగా వెహికిల్స్​లో ఎక్కించుకొని సరాసరి కోర్టుకు తీసుకెళ్లారు. స్పెషల్​జ్యుడీషియల్​ఫస్ట్​ క్లాస్​ మేజిస్ర్టేట్​(ఎక్సైజ్ కోర్టు) ఎదుట వీరిని హాజరుపర్చారు. శానగొండ రాజేందర్​, ఎం.సుమన్ ​యాదవ్​, అరెందుల రాజేశ్, సింగరవేణి శివకుమార్​, ఠాకూర్ ​తరుణ్​ పరారీలో ఉన్నారని చెప్పారు. కేసును పరిశీలించిన మేజిస్ర్టేట్​ నిందితులకు బెయిల్​ శాంక్షన్​ చేశారు.

అరెస్టులకు భయపడేది లేదు: బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​రావు
ప్రజల పక్షాన పోరాడుతున్న బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎస్​ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అణిచివేయాలని చూస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు మండిపడ్డారు. తాము కేసులకు, అరెస్టులకు భయపడబోమన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ మంచిర్యాల పోలీస్​ స్టేషన్​ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్​రావు మాట్లాడుతూ పోలీసులు రూలింగ్​ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. యువమోర్చా లీడర్ల సంతకాలు తీసుకొని ఐదు నిమిషాల్లో పంపుతామని అబద్ధాలు చెప్పి, అక్రమంగా అరెస్టు చేశారని ఫైర్​ అయ్యారు. ఏసీపీ రష్మీ పెరుమాల్​, పోలీస్ ​కమిషనర్ ​చంద్రశేఖర్​రెడ్డిలకు  ఫోన్ ​చేయగా  చట్టప్రకారమే యాక్షన్​ తీసుకుంటున్నామని చెప్పడం బాధాకరమన్నారు. ఫ్రెండీ పోలీసింగ్​ అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ లీడర్లు పెద్దపల్లి పురుషోత్తం, తుల మధుసూదన్​రావు, వంగపల్లి వెంకటేశ్వర్​రావు, కొయ్యల ఏమాజీ, అగల్ ​డ్యూటీ రాజు, పత్తి శ్రీనివాస్​, బోయిని హరికృష్ణ, సోమ ప్రదీప్​చంద్ర పాల్గొన్నారు.