చిన్నారిపై అత్యాచారం చేసిన ప్రిన్సిపల్ కారు డ్రైవర్ కు 20 ఏళ్ల జైలు

చిన్నారిపై అత్యాచారం చేసిన ప్రిన్సిపల్ కారు డ్రైవర్ కు 20 ఏళ్ల జైలు

బంజారాహిల్స్ లోని బీఎస్‌డీ డీఏవీ పాఠశాలలో నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడిని దోషిగా తేల్చింది. 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు చెప్పింది. గతేడాది అక్టోబర్17న బంజారాహిల్స్ లోని డీఏవీ స్కూల్ ప్రిన్సిపల్ కారు డ్రైవర్ రజనీ కుమార్ పై పీఎస్ లో కేసు నమోదైంది. పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల బాలికపై రజనీ కుమార్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. నిందితుడు రజనీ కుమార్ ను  దోషిగా తేలుస్తూ తీర్పు వెల్లడించింది.

అసలేమైందంటే..

బంజారాహిల్స్ లోని బీఎస్‌డీ డీఏవీ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి ఘటన నేపథ్యంలో స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు చేశారు. దీంతో అప్పట్లో పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ తర్వాత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాలను పున: ప్రారంభించాలని మరికొందరు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దీంతో ఆ విద్యా సంవత్సరానికి డీఏవీ పాఠశాలను కొనసాగించవచ్చని అనుమతి ఇచ్చారు. విద్యాశాఖ సూచించిన నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.