- నిందితురాలి మేనమామ ఫిర్యాదు
జైపూర్: రాజస్తాన్‌లోని జైపూర్‌లో సుఫారీ ఇచ్చి కన్నకూతురే తల్లిని చంపించిన కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిని చంపించిన కూతురు ఆయుషి శర్మనే తన తండ్రి విజయ్ శర్మను కూడా గతంలో ఇలాగే చంపేసిందని ఆమె మేనమామ రాకేష్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది తండ్రికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు.. ఆయుషి ఎవరికీ చెప్పకుండా ఆయనను ఒక గుర్తుతెలియని ఆసుపత్రిలో చేర్చిందని తెలిపారు. మూడు నెలల పాటు కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు.
ఆ తర్వాత తండ్రిని ఇంటికి తెచ్చినా.. అప్పటికే విజయ్ శర్మ అవయవాలు బాగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఇంట్లో ఉన్న టైంలో కూడా తండ్రికి అమర్చిన ఫీడింగ్ ట్యూబ్‌ను (ఆహార గొట్టాన్ని) ఆయుషి కావాలనే తొలగించిందని.. అందువల్లే ఆయన చనిపోయారని మేనమామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై కూడా పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. తల్లి నీరజ్ శర్మను రోడ్డు ప్రమాదంలో హతమార్చిన కేసులో ఐదుగురు కాంట్రాక్ట్ కిల్లర్లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా.. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు బలరామ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.
గవర్నమెంట్ జాబ్ కోసమే..
ప్రభుత్వ ఉద్యోగం, ఆస్తిపై ఉన్న దురాశతోనే ఆయుషి శర్మ తన తల్లిని చంపించిందని పోలీసులు నిర్ధారించారు. జైపూర్ కోర్టులో కోర్ట్ మాస్టర్‌గా పనిచేసిన విజయ్ శర్మ గతేడాది మరణించడంతో.. ఆయన భార్య నీరజ్ శర్మకు కారుణ్య నియామకం కింద అదే కోర్టులో క్లర్క్‌గా ఉద్యోగం వచ్చింది. అయితే, ఎల్ఎల్బీ ఫైనలియర్ చదువుతున్న కూతురు ఆయుషికి ఆ ఉద్యోగంపై కన్ను పడింది. తల్లి బతికుంటే ఉద్యోగం తనకు రాదని, అలాగే కుటుంబ ఆస్తి కూడా దక్కదని ఆమె భావించింది. దీంతో ఎలాగైనా తల్లిని వదిలించుకోవాలని ప్లాన్ వేసింది.
రూ. 7 లక్షలకు కాంట్రాక్ట్ కిల్లర్లను మాట్లాడి..
ప్లాన్ ప్రకారం.. ఆయుషి, తన కజిన్ బలరామ్ సహాయంతో రూ.7 లక్షలకు కాంట్రాక్ట్ కిల్లర్లను మాట్లాడింది. తల్లిని చంపి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని వారు నిర్ణయించుకున్నారు. జూలై 3న నీరజ్ శర్మ తన చిన్న కొడుకును కోచింగ్ సెంటర్లో దించి తిరిగి వస్తుండగా.. ఒక కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నీరజ్ శర్మ అక్కడికక్కడే చనిపోయారు. అయితే, పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో ఆయుషి వేసిన ప్లాన్ బయటబడింది.
