జెన్‌‌ జీ ఓటర్లను జాబితా నుంచి తప్పించేందుకే సర్‌‌ : కాంగ్రెస్‌‌

జెన్‌‌ జీ ఓటర్లను జాబితా నుంచి తప్పించేందుకే సర్‌‌  : కాంగ్రెస్‌‌
  • సీఈసీ జ్ఞానేశ్‌‌ కుమార్‌‌రాజీనామా చేయాలన్న కాంగ్రెస్‌‌
  • ప్రధాని మోదీ, అమిత్‌‌ షాపైజైరాం రమేశ్‌‌ ఆరోపణలు

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌‌) ప్రక్రియలో జెన్‌‌జీ ఓటర్లను జాబితా నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌‌ ఆరోపించింది.  ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌ జ్ఞానేశ్‌‌ కుమార్‌‌ వెంటనే రాజీనామా చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌‌ డిమాండ్‌‌ చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌‌ షా ఈ వ్యవహారానికి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ‘ది ఇండియన్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌’లో వచ్చిన కథనాలను ఉటంకిస్తూ రమేశ్‌‌ పలు ఆరోపణలు చేశారు.

గోవా చీఫ్‌‌ ఎలక్టోరల్‌‌ ఆఫీసర్‌‌ (సీఈఓ) ఏడు రోజుల్లో 8 సార్లు ఈసీకి ఈ మెయిళ్లు పంపి, ఎలక్టోరల్‌‌ రిజిస్ట్రేషన్‌‌ అధికారులు (ఈఆర్‌‌ఓలు) అర్హులుగా నిర్ధారించిన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని కోరినా స్పందన రాలేదన్నారు. గోవాలో 97 మంది ఓటర్లు అర్హులేనని స్థానిక అధికారులు నిర్ధారించినట్లు వచ్చిన నివేదికను ఆయన ప్రస్తావించారు.  సర్‌‌ ప్రక్రియలో ఈసీఐనెట్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌ వినియోగం, ఈఆర్‌‌ఓల అధికారాలపై కూడా రమేశ్‌‌ ప్రశ్నలు లేవనెత్తారు.

ఓటర్ల జాబితా నిర్వహణలో ఈఆర్‌‌ఓల ప్రాప్యతను పరిమితం చేశారని, కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారం-6 ప్రక్రియను మరింత క్లిష్టతరం చేశారని ఆరోపించారు. వార్షిక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌‌ఎస్‌‌ఆర్‌‌) నిలిచిపోవడంతో 18 ఏళ్లు నిండిన యువత కొత్తగా ఓటర్లుగా నమోదు కావడంలో జాప్యం జరుగుతోందన్నారు. సర్‌‌ ప్రక్రియపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌‌బీర్‌‌ సింగ్‌‌ సంధు, వివేక్‌‌ జోషి పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న నివేదికల నేపథ్యంలో రాజకీయ దుమారం చెలరేగింది.

పది నెలల్లో పలు నిర్ణయాలు, ఆదేశాలపై ఇద్దరు కమిషనర్లు కనీసం 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ‘ఇండియన్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌’ నివేదిక పేర్కొంది. ఈ అభ్యంతరాలు ఓటర్ల చేర్పులు, తొలగింపులు, పునరుద్ధరణలు, ఫారం-6 మార్పులు, ఓటర్ల డేటాబేస్‌‌ నిర్వహణ వంటి అంశాలకు సంబంధించినవిగా తెలిపింది.

భిన్నాభిప్రాయాలు సాధారణమే: ఈసీ

ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం బుధవారం స్పందించింది. బహుళ సభ్యుల రాజ్యాంగ సంస్థలో భిన్నాభిప్రాయాలు, సూచనలు సాధారణమేనని స్పష్టం చేసింది. తుది నిర్ణయాలు మాత్రం ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ నిర్ణయాలేనని పేర్కొంది. ముసాయిదా దశలో కమిషన్‌‌ సభ్యులు చేసే ప్రశ్నలు, సూచనలు ఎన్నికల ప్రక్రియను మెరుగుపరిచేందుకు జరిగే సాధారణ అంతర్గత పరిశీలనలో భాగమేనని తెలిపింది.