
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సైనిక దాడులకు ముందే పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తోన్న ఆరోపణలను కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తోసిపుచ్చారు. సోమవారం (మే 26) పార్లమెంటులో సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. కాల్పుల విరమణలో యునైటెడ్ స్టేట్స్ పాత్ర, సింధు జల ఒప్పందం రద్దు, ఆపరేషన్ సిందూర్ చుట్టూ ఉన్న నెలకొన్న వివాదాలకు సంబంధించి ఈ భేటీలో ఎంపీలు లేవనెత్తిన ప్రశ్నలకు జైశంకర్ క్లారిటీ ఇచ్చారు.
ఆపరేషన్ సిందూర్ గురించి తాను పాకిస్తాన్‌కు ముందే సమాచారం ఇచ్చానని కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ఆరోపణలు నిజాయితీ లేనివని కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ సిందూర్ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తోందన్నారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత భారత సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ (DGMO) పాకిస్తాన్ డీజీఎంవోకీ సమాచారం ఇచ్చారు.. అంతేకానీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఆపరేషన్ సిందూర్ ప్రారంభానికి ముందే తాను పాకిస్థాన్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వివరణ ఇచ్చారు.
భారత ఆర్మీ ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలపై ఖచ్చితమైన రీతిలో దాడి చేసి పాకిస్తాన్ నైతికతను విజయవంతంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. అలాగే పాక్, భారత్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా పాత్ర ఏం లేదని మరోసారి స్పష్టం చేశారు. ఇరు దేశాల డీజీఎంవోల మధ్య మాత్రమే కాల్పుల విరమణకు సంబంధించి చర్చలు జరుగుతాయని అమెరికాకు తేల్చి చెప్పామన్నారు. ఇక, సిందూ నది జలాల ఒప్పందం ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉందని.. దాని నిబంధనలను తిరిగి సమీక్షించడానికి లేదా మార్చడానికి తక్షణ ప్రణాళికలు ప్రస్తుతానికైతే ఏం లేవని జైశంకర్ క్లారిటీ ఇచ్చారు.
కాగా, ఆపరేషన్ సిందూర్ సైనిక దాడులకు ముందే జైశంకర్ పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చారని.. తద్వారా భారత్ వైమానిక దళానికి నష్టం జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. జైశంకర్ పాక్‌కు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు . ఈ క్రమంలో జైశంకర్ పై విధంగా క్లారిటీ ఇచ్చారు.