అవినీతిపై యుద్ధం చేసిన వీరుడు జైట్లీ : అమిత్ షా, రాజ్ నాథ్

అవినీతిపై యుద్ధం చేసిన వీరుడు జైట్లీ : అమిత్ షా, రాజ్ నాథ్

కేంద్రమాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ మరణంపై కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్రమైన విచారం వ్యక్తంచేశారు. ఢిల్లీ కైలాష్ కాలనీలోని అరుణ్ జైట్లీ ఇంట్లో ఆయన పార్థివ దేహానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్రమంత్రులు, ప్రముఖులు నివాళులు అర్పించారు. అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా.. బీజేపీ అగ్రనేతలు, పలు రాష్ట్రాల సీఎంలు అంజలి ఘటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తరఫున కూడా రాజ్ నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. ఆ తర్వాత తమ సంతాప సందేశాన్ని వినిపించారు.

అరుణ్ జైట్లీ లేడన్న వార్తను బీజేపీ తట్టుకోలేకపోతోందన్నారు అమిత్ షా. జైట్లీ లేకపోవడం బీజేపీకి భరించలేని నష్టం అని చెప్పారు అమిత్ షా. అవినీతిపై అలుపెరగని యుద్ధం చేసిన వీరుడు జైట్లీ అని అమిత్ షా అన్నారు. విద్యార్థి నాయకుడిగా ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల పాటు జైలు జీవితం గడిపారని చెప్పారు. పార్లమెంట్ సభ్యుడిగా.. జనం గొంతును ప్రతిసారి వినిపించారని గుర్తుచేశారు అమిత్ షా.

అరుణ్ జైట్లీ అందించిన సేవలను దేశం ఎన్నడూ మరిచిపోదని అన్నారు రాజ్ నాథ్ సింగ్. ప్రభుత్వానికి, పార్టీకి అరుణ్ జైట్లీ పెద్ద ఆస్తి అని చెప్పారు. ఆయన అందరినీ విడిచిపెట్టి వెళ్లిపోవడం బాధగా ఉందన్నారు రాజ్ నాథ్.

అరుణ్ జైట్లీకి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, బీజేపీ అగ్ర నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ నివాళులు అర్పించారు. ఆయన పార్ధివదేహంపై అద్వానీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. జైట్లీ కుటుంబసభ్యులను ఓదార్చారు.

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ అరుణ్ జైట్లీ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.

కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ జైట్లీ పార్థివ దేహం వద్ద శ్రద్దాంజలి ఘటించారు.