- బీసీలంతా తరలి రావాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు
హైదరాబాద్, వెలుగు: బీసీ జేఏసీ ఆదివారం హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఉన్న కళింగ భవన్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ఈ మీటింగులో బీసీ జేఏసీ భవిష్యత్ ఉద్యమ కార్యచరణను ప్రకటించనున్నారు. కళింగభవన్ లో జరుగుతున్న సమావేశ ఏర్పాట్లను బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర బీసీ సంఘాల నేతలతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి గత నెల 12వ తేదీన హైదరాబాదులో బీసీ జేఏసీని ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు.గత నెల 18వ తేదీన రాష్ట్ర బంద్ చారిత్రాత్మకంగా జరిగిందని వెల్లడించారు.
రాష్ట్ర బంద్ తర్వాత భవిష్యత్తులో గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ ఉద్యమ తరహాలోనే పోరాడడానికి సమస్త శ్రేణులను, సామాజిక ఉద్యమ శక్తులను ఏకం చేస్తున్నామన్నారు. బీసీ జేఏసీని మరింత విస్తృత పరిచి, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ఆదివారం జరిగే సమావేశం ద్వారా వెల్లడిస్తామని తెలిపారు. సమావేశంలో రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, ఆర్టీసీ, సింగరేణి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, డాక్టర్లు, జర్నలిస్టులు, కవులు, రచయితలు, గాయకులు, సబ్బండ వర్గాలవారు పాల్గొనాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో... బీసీ జేఏసీ కో ఆర్డినేటర్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందరం గణేశ్ చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాం కుర్మా తదితరులు పాల్గొన్నారు.
