- బీసీ జాక్ వర్కింగ్ చైర్మన్ జాజుల
హైదరాబాద్ సిటీ, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు తీరని ద్రోహం చేసిందని బీసీ జాక్వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేండ్లు బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 30న హైదరాబాద్లో యుద్ధభేరి సభను నిర్వహించనున్నట్లు తెలిపారు.
డిసెంబర్ 8, 9 తేదీల్లో అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో ధర్నా చేస్తామని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ కుల సంఘాల జేఏసీ కన్వీనర్ కుందారపు గణేశా చారి అధ్యక్షతన జరిగిన బీసీ జేఏసీ మీడియా సమావేశానికి జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పంచాయతీ రిజర్వేషన్లు తప్పుల తడక అని, అందులో శాస్త్రీయత లేదని విమర్శించారు. నల్గొండలో 2019లో బీసీ విభాగంలో సర్పంచ్ స్థానాలు 164 ఉంటే, ఇప్పుడు 140 స్థానాలే ఇచ్చారన్నారు. దీంతో బీసీలు 24 స్థానాలను నష్టపోవాల్సి వస్తున్నదన్నారు. జీవో 46ను కూడా సక్రమంగా అమలు చేయకుండా అగ్రవర్ణాలకు అత్యధిక స్థానాలు ఇచ్చారని మండిపడ్డారు.
బీసీలకు రావాల్సిన స్థానాలను జనరల్ కేటాయించారని, అటువంటి స్థానాల్లో బీసీ అభ్యర్థులను నిలబెడుతామన్నారు. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఓట్చోరీ జరిగిందని రాహుల్ గాంధీ అంటున్నారని, కానీ తెలంగాణలో రిజర్వేషన్ల చోరీ జరిగిందని గ్రహించాలని సూచించారు.
