సెప్టెంబర్ 10న 5 లక్షల మందితో బీసీల సింహగర్జన సభ : జాజుల శ్రీనివాస్ గౌడ్

సెప్టెంబర్ 10న 5 లక్షల మందితో బీసీల సింహగర్జన సభ : జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ : సెప్టెంబర్ 10వ తేదీన సరూర్ నగర్ స్టేడియంలో 5 లక్షల మందితో బీసీల సింహగర్జన సభను నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. బీసీల సింహ గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎల్బీనగర్ లో శనివారం రోజు (ఆగస్టు 19న) బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. 

119 నియోజకవర్గాల్లోని ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు 3 వేల మందితో బీసీల సింహగర్జన సభకు రావాలని పిలుపునిచ్చారు జాజుల శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ వ్యాప్తంగా రెండున్నర కోట్ల మంది బీసీలు ఉన్నారని చెప్పారు. కులానికో సీటు.. బీసీలకే ఓటు.. ఓటు మనదే.. సీటు మనదే అనే నినాదంతో ముందుకెళ్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు జనాభా ప్రాతిపదికన బీసీలకు టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 100 శాతం 60 టికెట్లు బీసీలకే కేటాయించాలని కోరారు. బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

బీసీల బతుకులు మారాలంటే ఓటు అనే ఆయుధంతోనే ఏదైనా సాధించవచ్చన్నారు. 5 లక్షల మందిని బీసీల సింహ గర్జనకు తరలించాలని కోరారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీసీల వాణిని వినిపించేందుకే సెప్టెంబర్ 10వ తేదీన సింహ గర్జన ఏర్పాటు చేశామన్నారు. గద్దర్ పేరుతోనే బీసీల సింహగర్జన వేదిక పేరు పెడుతున్నామని చెప్పారు. కేసీఆర్.. సిట్టింగులకే మళ్లీ టికెట్లు కేటాయిస్తే.. ముఖ్యమంత్రి పీఠం కూలడం ఖాయమన్నారు. 

బీఆర్ఎస్ పార్టీ సీనియర్లకు కాకుండా కొత్త వాళ్లకు అవకాశం ఇస్తే అధికారంలోకి వస్తుందని, లేదకపోతే ఓడిపోవడం ఖాయమన్నారు. బీసీ సింహ గర్జన సభలో బహుజన బిడ్డే ముఖ్యమంత్రి కావాలనే తీర్మానం చేస్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 60 శాతం టికెట్లు ఇవ్వాలని, ఇదే రాజకీయ పార్టీలకు చివరి అవకాశమని చెప్పారు. లేకుంటే బీసీల రాజకీయ పార్టీ పెడుతామని తెలిపారు.