James Anderson: కోహ్లీ, సచిన్‌లలో ఎవరికి బౌలింగ్ చేయడం కష్టం.. అండర్సన్ సమాధానమిదే!

James Anderson: కోహ్లీ, సచిన్‌లలో ఎవరికి బౌలింగ్ చేయడం కష్టం.. అండర్సన్ సమాధానమిదే!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ టీమిండియా తరపున బ్యాటింగ్ రికార్డులన్నీ తమ పేరిట లిఖించుకున్నారు. అప్పటి తరంలో సచిన్  ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవాడు. ఇప్పుడు కింగ్ కోహ్లీ క్రీజ్ లో ఉంటే ఎదురుగా ఎలాంటి జట్టు ఉన్నా బెంబేలిత్తిస్తాడు. ఈ ఇద్దరిలో ఎవరు గ్రేట్ అనే విషయం చెప్పడం కష్టం. అయితే ఇదే ప్రశ్న ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కు ఎదురైంది. ఒక పోడ్ కాస్ట్ లో కోహ్లీ, సచిన్ లలో ఎవరికి బౌలింగ్ చేయడం కష్టం అనే ప్రశ్నకు ఆండర్సన్ సమాధానమిచ్చాడు. 

టాక్‌స్పోర్ట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ పేస్ లెజెండ్ జేమ్స్ ఆండర్సన్ ఆధునిక క్రికెట్‌లో విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడం కష్టమని.. ఫ్యాబ్ ఫోర్‌ స్టీవ్ స్మిత్, విలియంసన్, రూట్, కోహ్లిలలో తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్‌ కోహ్లీ అని అండర్సన్ చెప్పాడు. అండర్సన్ మాట్లాడుతూ.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కంటే కోహ్లీకి బౌలింగ్ చేయడం నాకు చాలా కష్టంగా అనిపించేదని.. కోహ్లీ క్రీజ్ లో ఉంటే బౌలర్ కు సవాలుగా ఉంటుందని తెలిపాడు. 

"2014లో కోహ్లీ మొదటిసారి ఇంగ్లాండ్‌కు వచ్చినప్పుడు అతనిపై నేను ఆధిపత్యం చూపించాను. అతను అవుట్‌సైడ్ ఆఫ్-స్టంప్ బంతులను ఆడడంలో ఉన్న బలహీనతను గుర్తించి ఔట్ చేశాను. ఆ తర్వాత కోహ్లీపై నేను ఆధిపత్యం చెలాయించలేకపోయాను. అతను  నన్ను ఎదర్కోవడంలో పూర్తిగా సఫలమయ్యాడు. విరాట్ పూర్తిగా భిన్నమైన ఆటగాడు. అతను నిజంగా తన ఆటను వేరే స్థాయికి తీసుకెళ్లాడు. అంతేకాదు అగ్ర బౌలర్లకు అతనికి బౌలింగ్ చేయడం కష్టంగా అనిపించేది. 2014-15 సిరీస్ లో నేను కోహ్లీని 4-5 సార్లు ఔట్ చేశాను. ఆ తర్వాత నేను కోహ్లీని ఔట్ చేయలేదు". అని అండర్సన్ టాక్‌స్పోర్ట్ పాడ్‌కాస్ట్‌లో చెప్పాడు.

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో కోహ్లీ, అండర్సన్ వార్ హైలెట్ గా నిలిచేది. ఓవరాల్ గా ఈ ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ విరాట్ ను 36 ఇన్నింగ్స్‌లలో 7 సార్లు ఔట్ చేశాడు. మరోవైపు కోహ్లీ.. అండర్సన్ బౌలింగ్‌లో 43.57 సగటుతో 305 పరుగులు చేశాడు. ఇటీవలే టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ లో 122 టెస్ట్‌ల్లో 9,230 పరుగులు చేశాడు. మరోవైపు సచిన్ టెండూల్కర్ ను అండర్సన్ తన పేస్ తో 9 సార్లు పెవిలియన్ కు చేర్చాడు.