
శ్రీనగర్: దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ప్రభుత్వం తొలగించిన వారిలో హెడ్ కానిస్టేబుల్ ఫరూక్ అహ్మద్ షేక్, సెలక్షన్ గ్రేడ్ కానిస్టేబుళ్లు సైఫ్ దిన్, ఖలీద్ హుస్సియాన్ షా, ఇర్షాద్ అహ్మద్ చల్కూ, కానిస్టేబుల్ రహ్మత్ షా, టీచర్ నజమ్ దిన్ ఉన్నారు. వీరు దేశ, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఇంటెలిజెన్స్ ఏజెన్సీల దృష్టికి వచ్చింది.
దీంతో లోతుగా దర్యాప్తు చేయగా.. వారు హిజ్బుల్ ముజాహిదీన్ సహా పాక్ ఆధారిత టెర్రరిస్టులతో పాటు డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్నారని తెలిసింది. అంతేకాకుండా, పెద్ద ఎత్తున డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా, నియంత్రణ రేఖ నుంచి అక్రమ చొరబాట్లకూ సహకరించారని రుజువైంది. డ్రగ్స్అమ్ముతూ తద్వారా వచ్చిన డబ్బును పాకిస్తాన్ టెర్రరిస్టులకు చేరవేస్తున్నట్టు తెలిసింది.
ఆ డబ్బును పాక్ టెర్రర్ గ్రూపులు ఉగ్రవాదాన్ని పెంపొందిచడానికి ఉపయోగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2)(సి)ని ఉపయోగించి ఆ ఆరుగురిని విధుల నుంచి తొలగించారు. పబ్లిక్ సర్వీస్‌లోని ఉద్యోగులు దేశ, రాష్ట్ర భద్రతకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే.. ఆర్టికల్ 311(2)(సి) ప్రకారం రాష్ట్రపతి లేదా గవర్నర్ సంబంధిత వ్యక్తులను ఉద్యోగంలో నుంచి తొలగించవచ్చు.