జమ్ములో కాంగ్రెస్‌‌కు ఎదురు దెబ్బలు

జమ్ములో కాంగ్రెస్‌‌కు ఎదురు దెబ్బలు

కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ బాటలో మరికొంత మంది నేతలు వెళుతున్నారు. ఆయన రాజీనామా చేసిన షాక్ లో నుంచి కాంగ్రెస్ తేరుకోకముందే.. మరో ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూ కశ్మీర్ కు చెందిన మరో ఐదుగురు నేతలు రాజీనామా చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. వీరంతా ఆజాద్ కు మద్దతుగా రాజీనామా చేసినట్లు రాజీనామా చేసిన లేఖలో వెల్లడించారు. 

రాజీనామా చేసిన వారు...

  • మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అమిమ్ భట్
  • మాజీ ఎమ్మెల్యే, అనంత్‭నాగ్ జిల్లా అధ్యక్షుడు గుల్జర్ అహ్మద్ వని
  • మాజీ మంత్రి, జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు జీఎం సరూరి
  • మాజీ ఎమ్మెల్యే, జమ్మూ కశ్మీర్ ఎస్టీ సెల్ చైర్మన్ చౌదరి మహ్మద్ అక్రమ్
  • మాజీ ఎమ్మెల్యే, జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు హాజి అబ్దుల్ రషీద్

తామంతా రాజీనామా చేయడం జరిగిందని, JKPC అధ్యక్షుడు మాత్రమే ఒంటరిగా మిగిలిపోతారని జీఎం సరూరి వెల్లడించారు. ఆజాద్ రాజీనామా చేస్తారని తమకు తెలుసని మాజీ మంత్రి ఆర్ఎస్ చిబ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో నిర్ణయాత్మక నాయకత్వాన్ని కాంగ్రెస్ కోల్పోయిందని పార్టీ గ్రాఫ్ క్షీణించడానికి ఇదే కారణమన్నారు. రాజీనామా చేసిన అనంతరం రాహుల్ గాంధీ పని తీరుపై ఆజాద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ ప్రవేశంతోనే కాంగ్రెస్ కు కష్టాలు ప్రారంభమయ్యాయని, అనుభవం ఉన్న నేతలను ఆయన పట్టించుకోలేదన్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పిల్ల చేష్టల్లా ఉన్నాయని అభివర్ణించారు. ఆజాద్ చేసిన విమర్శలను కాంగ్రెస్ సీనియర్ నేతలు తప్పుబడుతున్నారు. అన్ని పదవులు అనుభవించి.. ఇప్పుడు రాజీనామా చేయడం కరెక్టు కాదన్నారు.