నా హయాంలోనే జంపన్న వాగుపై బ్రిడ్జి కట్టాం

నా హయాంలోనే జంపన్న వాగుపై బ్రిడ్జి కట్టాం

2002 తో పోలిస్తే మేడారం జాతరలో చాలా మార్పులు వచ్చాయన్నారు వరంగల్ మాజీ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. తన హయాంలో జంపన్న వాగుపై బ్రిడ్జి నిర్మించామని, ఆ తర్వాతే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. గతంలో ప్రభుత్వాలు మేడారం జాతరకు బడ్జెట్ కేటాయించలేదని చెప్పారు.

మీడియాతో మాట్లాడుతూ.. ఒకప్పుడు నక్సలైట్ మూముంట్ ఉండేది కాబట్టి జాతరకు భక్తులు అంతగా వచ్చే వాళ్లు కాదని, కేవలం చుట్టూ ప్రక్కల వాళ్లు మాత్రమే ట్రాక్టర్లు, బండ్ల సహయంతో రెండేళ్లలో మూడు రోజులే వచ్చేవారన్నారు. 2002లో జంపన్న వాగు బ్రిడ్జి నిర్మాణం తర్వాతనే జాతరకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిందని, ప్రస్తుతం ప్రతీ ఆదివారం 5 లక్షల మంది భక్తులు ఈ ప్రాంతానికి వస్తున్నట్లు పేపర్ లలో చూస్తున్నానని అన్నారు.

తాను కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కాలంలో.. భక్తులు ఇబ్బంది పడకూడదని వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేయబోతే అన్నలు కట్టొద్దని అడ్డుకున్నారన్నారు. అటవీ మార్గంలో బ్రిడ్జి కట్టినట్లయితే పోలీసుల మూమెంట్ ఉంటుందనే భయంతో నిర్మాణానికి ఉపయోగించే ప్రొక్లెయిన్ ను కూడా బ్లాస్ట్ చేశారన్నారు.

కానీ అక్కడున్న స్థానిక మహిళలు మాత్రం తమకి బ్రిడ్జి అవసరమని, తమ పిల్లల స్కూళ్లకు వెళ్లాలన్నా, అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్లాలన్నా, ఏ ఇబ్బంది లేకుండా సులభంగా వెళ్లాలంటే నిర్మాణం జరగాల్సిందేనని డిమాండ్ చేశారన్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా.. వారు నిర్మాణానికి అడ్డుపడకుండా.. సైట్ చుట్టూ పడుకున్నారన్నారు. ఎవరైనా వస్తే మమ్మల్ని చంపేసి తర్వాత బ్రిడ్జి దగ్గరకు పొండి అని చెప్తామని ధైర్యసాహసాలు ప్రదర్శించారన్నారు ప్రభాకర్ రెడ్డి. వారి సహాయంతోనే కేవలం 37 రోజుల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని ఆయన తెలిపారు.

బ్రిడ్జి నిర్మించిన తర్వాత పబ్లిసిటి బాగా పెరిగి.. సీఎం, పీఎం లు కూడా వచ్చారన్నారు మాజీ కలెక్టర్. అంతకు ముందు ఒక్క బస్సు కూడా లేని ఈ రూట్ కి ఆర్టీసీ వారు ఆరు బస్సులు వేశారన్నారు.  గత ప్రభుత్వాలు మేడారం జాతరకు ఎలాంటి నిధులు చేయలేదని, కేవలం హుండీలో వచ్చిన డబ్బుతోనే తన ఆధ్వర్యంలో బ్రిడ్జి నిర్మాణం చేశామన్నారు. కలెక్టర్ గా ఉన్న సమయంలో తానే గన్ పేల్చి జాతరను ప్రారంభించానని, ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత కూడా ప్రతీ సారి జాతరకు వస్తున్నానని గత మధురానుభూతులు గుర్తు చేసుకున్నారు. భక్తుల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతుండడం చూసి గర్వంగా ఉంటుందని అన్నారు ఈ మాజీ కలెక్టర్ .