
CIBIL Score: చాలా కాలం తర్వాత దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి రావటంతో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల సమావేశంలో వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో సొంతింటి కల ఉన్న వ్యక్తులు చాలా కాలం తర్వాత తగ్గిన వడ్డీ రేట్లకు రుణాలను పొందాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
ALSO READ | IPO News: ఐపీవో నష్టాల విధ్వంసం.. షేర్లు ఎగబడి అమ్మేసిన ఇన్వెస్టర్లు, లోయర్ సర్క్యూట్..
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు బలమైన సిబిల్ స్కోర్ కలిగిన వ్యక్తులకు సరసమైన వడ్డీ రేట్లకే రుణాలను అందించటానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఏఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేట్లకు హోం లోన్స్ ఆఫర్ చేస్తున్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:
ముందుగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.50 శాతం ప్రారంభ వడ్డీ రేటుకు గృహ రుణాలను ఆఫర్ చేస్తోంది. రుణగ్రహీతలు రుణ మొత్తంలో 0.35% + GST ప్రాసెసింగ్ ఫీజు రూపంలో భరించాల్సి ఉంటుంది.
కెనరా బ్యాంకు:
కెనరా బ్యాంక్ కూడా అత్యుత్తమమైన రేట్లకు హోం లోన్స్ అందిస్తోంది. అర్హులైన రుణగ్రహీలకు బ్యాంకు కేవలం 7.40 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో హోమ్ లోన్ ఆఫర్ చేస్తోంది. రుణం పొందిన వ్యక్తులు 0.50 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు భరించాల్సి ఉంటుంది. కనీసం రూ.1500 + GST నుండి గరిష్టంగా రూ.10,000 + GSTగా ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:
మీరు ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి గృహ రుణాన్ని పరిగణించవచ్చు. ఇక్కడ బ్యాంక్ కేవలం 7.35 శాతం ప్రారంభ వడ్డీ రేటుకు గృహ రుణాన్ని అందిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు గురించి మాట్లాడుకుంటే, మీరు ఇక్కడ నుండి రుణం తీసుకుంటే, మీరు లోన్ మొత్తంలో 0.50%, గరిష్టంగా రూ. 15,000 + GST చెల్లించాలి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:
ప్రభుత్వ యాజమాన్యంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అర్హులు కేవలం 7.35 శాతం వడ్డీ రేటుకే హోమ్ లోన్ పొందవచ్చు. ఇందుకోసం సదరు వ్యక్తుల కనీస సిబిల్ స్కోర్ 800 పాయింట్లుగా ఉండాలని బ్యాంక్ నిబంధన చెబుతోంది. ఇందుకోసం రుణ మొత్తంలో 0.50%.. లేదా గరిష్టంగా రూ. 20,000 + GSTని ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర:
ఇక చివరిగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా 7.35 శాతం ప్రారంభ వడ్డీ రేటుకే హోమ్ లోన్ ఆఫర్ చేస్తోంది. మహిళలు, రక్షణ సిబ్బందికి గృహ రుణాలపై 0.05 శాతం అదనపు తగ్గింపును కూడా బ్యాంక్ అందుబాటులో ఉంచింది. గృహ రుణాలు తీసుకునే కస్టమర్లు కారు, విద్య రుణాలు తీసుకుంటే డిస్కౌంట్ లభిస్తుందని బ్యాంక్ చెబుతోంది.