SL vs BAN: 5 పరుగులకే 7 వికెట్లు.. క్రికెట్ చరిత్రలోనే బంగ్లాదేశ్ అత్యంత చెత్త రికార్డ్

SL vs BAN: 5 పరుగులకే 7 వికెట్లు.. క్రికెట్ చరిత్రలోనే బంగ్లాదేశ్ అత్యంత చెత్త రికార్డ్

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 77 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. కొలంబో వేదికగా ఆర్.ప్రేమదాస స్టేడియంలో బుధవారం (జూలై 2) జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లా ఓటమి షాకింగ్ కు గురి చేస్తుంది. బంగ్లాదేశ్ బౌలర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 244 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ అసలంక (106) సెంచరీతో ఒంటరి పోరాటం చేసి జట్టుకు గౌరవప్రథమమైన స్కోర్ అందించాడు. లక్ష్య ఛేదనలో ఒక దశలో బంగ్లా గెలుపు దిశగా పయనించింది. ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్(62) చెలరేగడంతో 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 100 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. 

ఈ స్కోర్ కార్డు చూస్తే బంగ్లా విజయంపై అనుమానాలు ఉండవు. అయితే ఇక్కడ నుంచే బంగ్లా పతనం ప్రారంభమైంది. వరుసగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. కేవలం 5 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి ఒక్కసారిగా ఓటమి అంచుల్లో నిలిచింది. ఒకదశలో వికెట్ నష్టానికి 100 పరుగులు చేసిన బంగ్లా.. స్వల్ప వ్యవధిలో ఘోరంగా కుప్పకూలి 8 వికెట్ల నష్టానికి 105 పరుగులతో నిలిచింది. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో 2 నుంచి 8 వికెట్ల మధ్య వికెట్లను తక్కువ స్కోర్ కే కోల్పోయిన జట్టుగా బంగ్లా చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. అంతకముందు ఈ రికార్డ్ యూఎస్ఏ పేరిట ఉంది. నేపాల్ జట్టుపై యూఎస్ఏ 8 పరుగుల వ్యవధిలో (23/1 నుంచి 31/8) 7 వికెట్లను కోల్పోయింది. జేకర్ అలీ 51 పరుగులు చేసి రాణించడంతో బంగ్లా స్కోర్ కనీసం 150 పరుగుల మార్క్ అయినా అందుకుంది. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అసలంక (106) సెంచరీతో చెలరేగితే మిగిలిన పెద్దగా అతనికి సహకరించలేదు. కుశాల్ మెండీస్ 45 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 35.5 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. స్పిన్నర్ హసరంగా 8 ఓవర్లలో కేవలం 10 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అసలంకకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.