
ఐటి రంగానికి పేరుపొందిన బెంగళూరులో తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. బెంగళూరులోని శేషాద్రిపురంలో 'నమ్మ ఫిల్టర్ కాఫీ' కేఫ్‌లో నిన్న సాయంత్రం ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎక్స్ట్రా కాఫీ కప్పు ఇవ్వడానికి నిరాకరించిన కేఫ్ సిబ్బందిపై కొందరు కస్టమర్లు దాడి చేశారు. ఈ సంఘటన సేవా రంగంలో పనిచేసే ఉద్యోగులపై పెరుగుతున్న దాడులను మరోసారి తెరపైకి తెచ్చింది.
వివరాల్లోకి వెళ్తే కొందరు కస్టమర్లు కలిసి వచ్చి ఒక కాఫీ ఆర్డర్ చేసి తరువాత కాఫీ షేరింగ్ చేసుకుకుందామని మరో ఎక్స్ట్రా ఖాలీ కప్పు అడిగారు. అయితే, కంపెనీ నిబంధనల ప్రకారం ఎక్స్ట్రా కప్పు ఫ్రీగా ఇవ్వడానికి కుదరదని కేఫ్ ఉద్యోగి చెప్పారు. కావాలంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేసి కప్పు కొనాలని సూచించారు. దీనికి ఆగ్రహించిన కస్టమర్లు మొదట మాటలతో తిడుతూ, ఆ తర్వాత భౌతిక దాడికి పాల్పడ్డారు.
సీసీటీవీలో రికార్డయిన దాడి దృశ్యాలు : ఈ దాడి మొత్తం దృశ్యాలు కేఫ్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఫుటేజీలో కేఫ్ ఉద్యోగి కస్టమర్లకు వివరించడానికి ప్రయత్నిస్తుండగా అతని తలపై దాడి చేయడం, తరువాత అతని ముఖంపై గాయపర్చడం, కడుపులో పలుమార్లు తన్నడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ ఘటనపై ప్రజల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఫ్రంట్‌లైన్ ఉద్యోగులసను రక్షించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
పోలీసుల దర్యాప్తు: ఈ ఘటనపై శేషాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఇప్పటికే పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు కూడా ప్రారంభించారు. దాడికి పాల్పడిన వారి గుర్తింపు ఇంకా నిర్ధారించనప్పటికీ, నిందితులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నామని పోలీస్ అధికారులు తెలిపారు.
కార్మికులపై పెరుగుతున్న దాడులు: ఇటీవలి కాలంలో బెంగళూరులో ఇలాంటి హింసాత్మక ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. కస్టమర్ల ఆగ్రహం, డెలివరీ సిబ్బంది పై అహంకారం, ఆటో డ్రైవర్లతో ప్రాంతీయ బాషా విబేధాలు ఇలా చాల రకాల దాడులు పెరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు కనీస మర్యాద లేకుండా హింసాత్మక ధోరణిని అలవాటు చేసుకుంటున్నారని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగ కొరత, ఎక్కువ పని గంటలతో సతమతమవుతున్న సేవా పరిశ్రమకు ఉద్యోగుల భద్రత మరో సవాలుగా మారాయి.