
‘బ్రహ్మాస్త్ర’ నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మిస్తూ.. ‘దంగల్’ డైరెక్టర్ నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ గ్లింప్స్ (Ramayana Glimpse) ఎలా ఉంది..? విజువల్స్ ఎలా ఉన్నాయి..? వీఎఫ్ఎక్స్ షాట్స్ ఎలా ఉన్నాయి..? కచ్చితంగా ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో వచ్చిన ‘ఆది పురుష్’ (Adipurush) సినిమా విజువల్స్ కంటే చాలా బెటర్ గానే ‘రామాయణ’ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. రామాయణం కొత్తగా అంటూ.. ఆయనకు వచ్చినట్టు తీసి విమర్శలు మూటగట్టుకున్న ఓం రౌత్ ఈ ‘రామాయణ’ గ్లింప్స్ చూస్తే తాను చేసిన పొరపాటు ఏంటో తెలుస్తుందని కొందరు నెటిజన్లు సూచించారు. వాస్తవానికి ఈ గ్లింప్స్లో సినిమాలోని సన్నివేశాలు తక్కువే ఉన్నాయి. టైటిల్ కార్డ్స్తో పాటు రాముడు, రావణుడి పాత్రలను గ్లింప్స్తో పరిచయం చేశారు. రాముడి పాత్రలో రణ్ బీర్ కపూర్ ఎలా ఉన్నాడనేది చూపించారు. రావణుడిగా ‘యష్’ను చూచాయగా చూపించారు.
పది తలల రావణుడి గెటప్లో ‘యష్’ను చూపించే భీకరమైన షాట్ ఒకటి గ్లింప్స్లో ఉంటుందని భావించిన వారికి నిరాశే ఎదురైంది. ‘రామాయణ’ గ్లింప్స్ వార్త బయటకు రాగానే ‘యష్’ను దశ కంఠుడిగా చూపిస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ హల్చల్ చేశాయి. వాటిల్లో కొన్ని అదిరిపోయాయి కూడా. అయితే.. ‘రామాయణ’ సినిమా బృందం మాత్రం పది తలల రావణుడిగా ‘యష్’ ఎలా ఉంటాడనే విషయాన్ని దాచి అంచనాలను మరింత పెంచింది. సీతగా నటిస్తున్న సాయిపల్లవిని గ్లింప్స్లో చూపించలేదు.
మొత్తంగా చెప్పాలంటే.. కథా నాయకుడు, ప్రతి నాయకుడిని మాత్రమే గ్లింప్స్తో పరిచయం చేశారు. రణ్ బీర్ కపూర్ శ్రీరాముడి లుక్లో చాలా బాగున్నాడు. ‘యష్’ కూడా రావణుడి పాత్రలో ఎలా ఉంటాడనే విషయం క్లారిటీ వచ్చేసింది. ఈ ‘రామాయణ’ గ్లింప్స్ చూశాక ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఇది కచ్చితంగా మరో ‘ఆది పురుష్’ అయితే కాదు. ఈ సినిమా విడుదల తర్వాత ఓం రౌత్కు ‘రామాయణ’ ఒక పాఠం అవుతుందనేలా గ్లింప్స్ చూశాక సినీ ప్రేక్షకులకు అనిపించిందనడంలో సందేహం లేదు. ఈ ‘రామాయణ’ విడుదలపై అభిమానులు ఎంత హైపెక్కించుకున్నా తప్పే కాదనేలా గ్లింప్స్ ఉంది.
నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘రామాయణ’ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. 2026 దీపావళికి ‘రామాయణ’ మొదటి భాగం విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది. రెండో భాగం 2027 దీపావళికి విడుదలవుతుందని ‘రామాయణ’ చిత్ర బృందం విడుదల తేదీలను కూడా ముందే ప్రకటించి ఈ సినిమాపై ధీమాగా ఉంది. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ నటిస్తుండటం విశేషం.