జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. 2026 మే 23న పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం విప్ పదవికి రాజీనామా చేశారు. పవన్ తో సుదీర్ఘంగ చర్చించిన అనంతరం తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
కేవలం వ్యక్తిగత కారణాల వల్లే విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో విప్ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగత కారణాల వలన.. ఈ పదవి బాధ్యతలు నిర్వహించలేనని.. అందుకే పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు.
అరవ శ్రీధర్ తో సుదీర్ఘంగా భేటీ అయిన పవన్.. రాజీనామా ఇవ్వాలని కోరారా.. లేక స్వయంగా అరవ శ్రీధర్ ఆ నిర్ణయం తీసుకున్నారా అనే అంశంపై స్పష్టత లేదు. అయితే తన వ్యక్తిగత కారణాల వలనే రాజీనామా చేస్తున్నట్లు అరవ శ్రీధర్ పేర్కొనటం గమనార్హం.
అరవ శ్రీధర్ పై ఇటీవల లైంగిక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఓ మహిళా ఉద్యోగి ఆరోపణలతో ఈ వ్యవహారంపై త్రిసభ్య కమిటీ వేశారు పవన్ కళ్యాణ్. విచారణలో భాగంగా వివాదంలో తనకు ఎలాంటి భాగస్వామ్యం లేదని చెప్పారు.
ALSO READ : హరీశ్ ఫ్యూచర్ సిటీని ఆపేస్తావా.?
అయితే ఇప్పటికీ బాధితురాలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటంతో విప్ పదవికి రాజీనామా చేయాల్సిందిగా పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కోరినట్లు తెలుస్తోంది. అయితే వ్యక్తిగత కారణాల వలన రిజిగ్నేషన్ ఇచ్చినట్లు అరవ శ్రీధర్ తెలిపారు.
