విద్యార్థుల అభివృద్ధికి దిక్సూచి

విద్యార్థుల అభివృద్ధికి  దిక్సూచి
  • డైలీ 30 నిమిషాల పీరియడ్​
  • ప్రైమరీ స్కూల్​నుంచి  ఇంటర్​ వరకు అమలు
  • అభ్యాసన సామర్థ్యాల పైంపు పై స్పెషల్ ఫోకస్​
  • గురుకులాల్లో ప్రతి స్టూడెంట్​కు హెల్త్​ ప్రొఫైల్ కార్డు
  • జనగామ కలెక్టర్ రిజ్వాన్​బాషా వినూత్న కార్యక్రమం

జనగామ, వెలుగు : విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంచేందుకు జనగామ కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్ ‘దిక్సూచి’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సర్కారు విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థుల​టాలెంట్ పెంచడంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గురుకులాలు, హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం హెల్త్ ప్రొఫైల్ కార్డుల జారీ చేస్తున్నారు. 

జిల్లాలోని ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్ వరకు ప్రతిరోజూ 30 నిమిషాలు ప్రత్యేకంగా క్లాస్​లు తీసుకుంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కెరీర్ కి అవసరమయ్యే అంశాలపై పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా దిక్సూచి పీరియడ్​లో రోజూ ఒక్కో టాపిక్ పై విద్యార్థులకు అరగంటపాటు టీచర్లు అవగాహన కల్పిస్తున్నారు.   

దిక్సూచిలో ఎనిమిది అంశాలను పొందుపరిచారు... 

1. విద్య, విజ్ఞాన నైపుణ్యం : చదవడం, రాయడం, కమ్యూనికేషన్, అంకెల అవగాహన, తార్కిక ఆలోచన, ఇంగ్లిష్, సాధారణ జ్ఞానం, శాస్త్రీయ ఆలోచన, ప్రయోగాలు, సృజనాత్మక ఆవిష్కరణలుగా ఉంటాయి. 

2. వ్యక్తిగత అభివృద్ధి నైపుణ్యం : స్వీయ అవగాహన, క్రమశిక్షణ, బాధ్యత, భావోద్వేగ నియంత్రణ, సమయపాలన, లక్ష్య నిర్ధారణ, ప్రేరణ, సరైన నిర్ణయాలు తీసుకోవడం

3. పౌర, నైతిక నైపుణ్యాలు : నిజాయితీ, నైతిక విలువలు, వైవిధ్యం, గౌరవించడం, పర్యావరణ పరిరక్షణ, సమాజ సేవ, మానవహక్కుల అవగాహన, డిజిటల్ భద్రత 

4. సామాజిక నైపుణ్యాలు : సరైన కమ్యూనికేషన్, శ్రద్ధగా వినడం, జట్టు కృషి, నాయకత్వం, ప్రజా ప్రసంగం, సహకారం 

5. కెరీర్, వృత్తి నైపుణ్యాలు : సమస్యల పరిష్కారం, ప్రాజెక్ట్ నిర్వహణ, వ్యాపార చైతన్యం, డబ్బు వినియోగం, పొదుపులపై క్లాస్​లు

6. శారీరక ఆరోగ్య నైపుణ్యాలు : వ్యాయామం, క్రీడలు, ఆరోగ్య సంరక్షణ, సరైన ఆహారం, పరిశుభ్రత, యోగా, ధ్యానం, ప్రథమ చికిత్సలు

7. సృజనాత్మకత, ఆవిష్కరణలు : కళలు, సంగీతం, నాటకం, కథ చెప్పడం, సృజనాత్మక రచన, కొత్త ఆలోచనలు, మీడియా కంటెంట్ సృష్టి 

8. సాంకేతిక, ఆధునిక నైపుణ్యాలు : కంప్యూటర్, కోడింగ్, డేటా విశ్లేషణ, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, సైబర్ భద్రత, డిజిటల్ అక్షరాస్యత తదితరాలపై మెలుకువలు నేర్పిస్తారు. 

స్టూడెంట్లకు హెల్త్​ ప్రొఫైల్ కార్డులు...

విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో జిల్లాలోని అన్ని గురుకులాల్లో హెల్త్​ ప్రొఫైల్​కార్డులను గత నెల 17 నుంచి జారీ చేస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ పెట్టి విద్యార్థులకు టెస్టులు చేస్తున్నారు. బ్లడ్ గ్రూప్, హిమోగ్లోబిన్ టెస్ట్, పల్స్ రేట్, బీపీ, షుగర్, టెంపరేచర్​, హార్ట్ రేట్, హైట్, వెయిట్​తదితర టెస్టులు చేసి కార్డులను అందిస్తున్నారు. జిల్లాలో గురుకుల స్టూడెంట్లు 15,395 మంది ఉండగా, హాస్టల్ స్టూడెంట్లు 1420 మంది ఉన్నారు. ఇప్పటివరకు 8,892 మంది గురుకుల స్టూడెంట్లకు హెల్త్ ప్రొఫైల్ కార్డులను జారీ చేశారు.  

విద్యార్థుల ఉన్నతి కోసమే.. 

విద్యార్థుల ఉన్నతి కోసమే జిల్లాలో దిక్సూచి కార్యక్రమాన్ని రూపొందించాం. ముఖ్యంగా డెఫిషియన్సీ, డెవలప్​మెంట్, డిజేబులిటీ, డిసీజెస్ పై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రతిరోజు 30 నిమిషాలపాటు ఒక పీరియడ్ కేటాయించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. అభ్యాసనా సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటాం. భవిష్యత్​లో ఉపయోగపడే అంశాలపై ఇప్పటినుంచే అవగాహన కల్పిస్తాం. ప్రతి విద్యార్థికి వైద్య పరీక్షలు చేసి హెల్త్​ ప్రొఫైల్ కార్డును అందజేస్తున్నాం. ‌‌‌‌ - కలెక్టర్ రిజ్వాన్​ బాషా షేక్​