GHMC ఎన్నికలు: బీజేపీకి జనసేన మద్దతు

GHMC ఎన్నికలు: బీజేపీకి జనసేన మద్దతు

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తున్నామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోందన్నారు. హైదరాబాద్‌లో బలమైన నాయకత్వం ఉండాల్సిన అవసరముందని, దీని కోసం బీజేపీకి పూర్తి మద్దతు ఇస్తున్నామని పవన్‌ ప్రకటించారు. GHMC ఎన్నికల క్రమంలో బీజేపీ అగ్రనేతలు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ నివాసంలో భేటీ అయ్యారు.

ఎన్నికల పరిస్థితులపై చర్చించారు. తర్వాత  మీడియాతో మాట్లాడిన పవన్ బీజేపీకి జనసేన పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఎన్నికల్లో బీజేపీ గెలవాల్సిన అవసరముందన్నారు. ఒక్క ఓటు కూడా బయటకు వెళ్లకుండా చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు భవిష్యత్తు ఎన్నికల్లోనూ ఇరుపార్టీలు కలిసి వెళ్తాయని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం  కోసం తమ పార్టీ అభ్యర్ధులు నిరాశ చెందినా…ప్రజల అభివృద్ధి కోసం ఎన్నికల్లో పోటీ చేయకుండా…బీజేపీకి మద్దుతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.ఇది తప్పని సరి పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయమన్నారు.

తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీనికి తాజా దుబ్బాక ఉపఎన్నికే నిదర్శనమని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనసేన తమకు మద్దతివ్వడం సంతోషంగా ఉందన్నారు. GHMC ఎన్నికల్లో బీజేపీతో కలిసి రావాలని జనసేనను కోరామని, బీజేపీ విజయానికి పూర్తిగా సహకరిస్తామని పవన్‌ కల్యాణ్‌ చెప్పారన్నారు. కేవలం ఈ ఎన్నికల్లోనే కాకుండా భవిష్యత్తులోనూ కలిసి పని చేస్తామని లక్ష్మణ్‌ తెలిపారు. హడావుడి నోటిఫికేషన్ తో పూర్తి స్థాయిలో చర్చించుకోలేక పోయామని.. అయినా జనసేన పూర్తి స్థాయిలో బీజేపీకి మద్దతు తెలిపేందుకు అంగీకరించిందని తెలిపారు. బీజేపీకి జనసేన తోడుంటే ప్రజల కలలు నెరవేరుతాయన్నారు.TRS పాలనతో ప్రజలు విసిగిపోయారని…ప్రజలు మార్పుకోరుకుంటున్నారని అది బీజేపీతోనే సాధ్యమన్నారు లక్ష్మణ్.