మార్కుల్లోనూ ట్విన్సే: ఇంటర్‌ ఫలితాల్లో కవలల ప్రతిభ

మార్కుల్లోనూ ట్విన్సే: ఇంటర్‌ ఫలితాల్లో కవలల ప్రతిభ

జనగామ, వెలుగు : కవలలు అంటే సహజంగా రూపంలో ఒకేలా ఉంటారు.. కానీ వీళ్లు రూపమేకాదు.. గుణగణాల్లో.. తెలివితేటల్లోనూ సేమ్‌ టూ సేమ్‌ అన్నట్లున్నారు. మరో ఆశ్చర్యమేమిటంటే సాధించే మార్కులు కూడా దాదాపుగా ఒకేలా ఉంటున్నాయి. ఒకటి రెండు సబ్జెక్టులు మినహా మిగతా అన్ని సబ్జెక్టుల్లోనూ ఒకే మార్కులు సాధిస్తున్నారు.తాజా ఇంటర్‌‌‌‌ ఫలితాల్లో ఇద్దరూ ఒకేలా మార్కులు తెచ్చుకుని అందరితో ఔరా అనిపించుకుంటున్నారు. జనగామ పట్టణంలోని తుర్కపల్లి యాదగిరి,సంధ్యకు ఇద్దరు కవల అమ్మాయిలు. వారికి అనోజ్ఞ,మనోజ్ఞగా పేరు పెట్టారు. కవలలు కావడంతో చిన్నప్పటి నుంచి వారిని ఒకేరీతిన పెంచారు. ఒకటినుంచి 10వ తరగతి వరకు దాదాపుగా ఒకేలా మార్కులు సాధిస్తూ వచ్చారు. టెన్త్‌‌‌‌ ఫలితాల్లో అనోజ్ఞకు 10 జీపీఏ రాగా హిందీలో రెండు మార్కులు తక్కువ రావడంతో మనోజ్ఞకు 9.8 జీపీఏ వచ్చింది.

హైదరాబాద్‌‌‌‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్‌‌‌‌చదివారు. ఇటీవలి ఫలితాల్లోనూ ఇద్దరూ దాదాపు ఒకేలా మార్కులు సాధించారు. గత ఏడాది మొదటి సంవత్సరం ఇంగ్లీష్‌ లో 95, సంస్కృతంలో 99, మ్యాథ్స్‌‌‌‌ ఏ, బీలో 75, ఫిజిక్స్‌‌‌‌, కెమిస్ట్రీలో 60 మార్కులు సాధించారు. గురువారం విడుదలైన ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మూడు సబ్జెక్టుల్లో కొద్ది తేడా రాగా మిగతా అన్నింటా ఒకే మార్కులు వచ్చాయి. ఇద్దరికి సంస్కృతంలో 99, మ్యాథ్స్‌‌‌‌ఏ, బీ సబ్జెక్టులలో 75 మార్కులు వచ్చాయి. ఇంగ్లీష్‌ , ఫిజిక్స్,కెమిస్ట్రీలో అనోజ్ఞకు 97, 53, 59, మనోజ్ఞకు 94, 58,60 మార్కులు వచ్చాయి. మొత్తంగా చూస్తే అనోజ్ఞ 982, మనోజ్ఞ 985 మార్కులు సాధించారు. సివిల్స్​ తమ లక్ష్యమని చెబుతున్నారు. వీరిని తల్లిదండ్రులతో పాటు, అధ్యాపకులు, మిత్రులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.