జనగామ అర్బన్, వెలుగు: సురక్షిత మాతృత్వానికి సమయానుకూల సేవలు అందించాలని, గర్భం దాల్చిన 12 వారాల్లోపు ఖచ్చితంగా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో మహిళా సంక్షేమ వారోత్సవాల సందర్భంగా ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కనీసం 4 ఏఎన్‌సీ పరీక్షలు తప్పనిసరని, ప్రతి గర్భిణీకి కనీసం నాలుగు సార్లు వైద్య పరీక్షలు నిర్వహించాలని, సాధ్యమైతే 8 సార్లు చేయించడం మంచిదని తెలిపారు.
బీపీ, డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్న వారిని హై రిస్క్ కేసులుగా గుర్తించి ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఐసీడీఎస్ ద్వారా గర్భిణీలకు అందించే పోషకాహారం, ఐరన్, కాల్షియం మాత్రలు వంద శాతం చేరాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం మే 31న నిర్వహించనున్న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ ఏర్పాట్లపై శుక్రవారం ఆయన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిపొగాకు రహిత సమాజమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించి, కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని, అవసరమైతే ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లను కూడా ధాన్యం తరలింపునకు ఉపయోగించుకోవాలని సూచించారు.
