- ఈ నెల 11 నుంచి 17 వరకు నిర్వహణ
- ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ.10 వేల నగదు పురస్కారం
జనగామ అర్బన్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, డీఈవో సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సన్నాహక సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 31 పాఠశాలల్లో నిర్మించనున్న కొత్త టాయిలెట్లకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
అలాగే 13 పీఎం శ్రీ పాఠశాలల్లో విద్యార్థులకు 15 రోజులపాటు ఆర్ట్స్, కల్చరల్, డ్యాన్స్, మ్యూజిక్ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ నెల 13న నియోజకవర్గాల వారీగా సర్పంచ్‌లతో వర్క్‌షాప్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు వారి సహకారం తీసుకోవాలని అన్నారు. 16న జిల్లా స్థాయి ఆర్ట్, కల్చరల్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థుల కోసం ధర్మకాంచ, కామారెడ్డిగూడెం, దేవరుప్పుల జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు.
వారోత్సవాల ముగింపు రోజైన 17న పదో తరగతి, ఇంటర్‌లో జిల్లా స్థాయిలో టాప్-3లో నిలిచిన విద్యార్థులతో పాటు క్రీడల్లో ప్రతిభ చూపిన ముగ్గురికి రూ.10 వేల నగదు పురస్కారంతో సన్మానం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ తదితరులు పాల్గొన్నారు.
