జనగామ అర్బన్, వెలుగు : పకడ్బందీగా ఎన్నికల విధులు నిర్వహించాలని, అధికారులు సమన్వయంతో పని చేయాలని, ఎన్నికల నియమావళి పైన పూర్తి అవగాహన ఉండాలని జనగామ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ భాషా తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కు సంబంధించి ఎంపీడీవోలు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్అధికారులకు ఎన్నికల నిబంధనల పై శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎలక్షన్ ఆఫీసర్ అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్ తో కలిసి మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. మాస్టర్ ట్రైనర్లు ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, నిర్వహణ ప్రక్రియలో ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. జిల్లాలో మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికల విధులను ప్రతీ ఒక్కరూ సజావుగా నిర్వహించాలన్నారు. నామినేషన్ స్వీకరణ, పరిశీలన, ఉప సంహరణకి సంబంధించిన ప్రక్రియ మొత్తం ఎన్నికల సంఘం నియమనిబంధనలకు అనుగుణంగా జరగాలన్నారు. జడ్పీ సీఈవో మాధురీ షా, డీఆర్డీవో వసంత, మాస్టర్ట్రైనర్లు పాల్గొన్నారు.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి
ములుగు: పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ములుగు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర అన్నారు. ములుగు కలెక్టరేట్ లో ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు, ఆర్డీవో వెంకటేశ్, డీపీవో శ్రీధర్ లతో కలిసి ఎంపీడీవోలు, ఎంపీవీవోలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఎన్నికలకు సంబంధించి వివరాలు వెల్లడించారు. జిల్లాలోని 9 మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నందున మంగపేట మండలంలో ఎన్నికలు నిర్వహించడంలేదని తెలిపారు.
అభ్యర్థులు ఎన్నికల నియమాలను తూచ తప్పకుండా పాటించాలన్నారు. నామినేషన్ల స్వీకరణకు క్లస్టర్ల వారీగా పాయింట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆర్డీవో సర్పంచ్ అభ్యర్థులకు, ఎంపీడీవోలు వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన బాధ్యులుగా ఉంటారన్నారు. ఇప్పటికే ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ ఇచ్చామని, మరో దఫా శిక్షణ ఉంటుందన్నారు. మూడు విడతల్లో జరిగే జీపీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం ప్రింటింగ్ ప్రెస్, ఫ్లెక్సీల షాపుల నిర్వాహకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ వేర్వేరుగా సమావేశమై పలు సూచనలు చేశారు.
