
న్యూయార్క్: కొత్త తరంలో తమకు తిరుగు లేదని వరల్డ్ నంబర్ 1,2 ఆటగాళ్లు యానిక్ సినర్, కార్లోస్ అల్కరాజ్ మరోసారి చాటి చెప్పారు. కొంతకాలంగా మెన్స్ టెన్నిస్‌ను ఏలుతున్న ఈ ఇద్దరూ ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యారు. అంచనాలను అందుకుంటూ.. యూఎస్ ఓపెన్‌లోనూ ఫైనల్ చేరుకున్నారు. 25వ గ్రాండ్‌స్లామ్ నెగ్గాలన్న సెర్బియా లెజెండ్ నొవాక్ జొకోవిచ్ కలకు అల్కరాజ్ సెమీఫైనల్లోనే అడ్డు పడగా.. కెనడా ప్లేయర్ ఆగర్ అలియాసిమ్‌కు సినర్ చెక్ పెట్టాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగే ఫైనల్లో ఈ చిరకాల ప్రత్యర్థులు ఢీకొట్టనున్నాడు. దాంతో ఒకే సీజన్‌లో వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో తలపడిన ఆటగాళ్లుగా రికార్డు సృష్టించనున్నారు. ఈ ఫైనల్ విన్నర్ వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును కూడా కైవసం చేసుకుంటాడు. జూన్‌లో ఫ్రెండ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్‌ను సినర్ ఓడించగా.. జులైలో వింబుల్డన్ తుదిపోరులో సినర్ టైటిల్ గెలిచి ప్రతీకారం తీర్చుకున్నాడు.
ఈసారి ఎవరిది పైచేయి అవుతుందన్నది ఆసక్తిగా మారింది. డిఫెండింగ్ చాంపియన్, ఇటలీస్టార్ సినర్ శుక్రవారం రాత్రి ఉత్కంఠగా సాగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కెనడా ఆటగాడు ఫెలిక్స్ ఆగర్ -అలియాసిమ్‌పై అద్భుత విజయం సాధించాడు. ఆట మధ్యలో పొట్ట నొప్పితో ఇబ్బంది పడినా, పోరాటం వదలని టాప్ సీడ్ 6–-1, 3–-6, 6–-3, 6–-4తో ఆగర్‌ను ఓడించాడు. తొలి సెట్‌లో సినర్ పూర్తి ఆధిపత్యం చూపెట్టాడు. కేవలం ఒకే గేమ్‌ను కోల్పోయి సెట్ సులభంగా గెలుచుకున్నాడు. అయితే, రెండో సెట్‌లో పొట్ట కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతని సర్వీస్ వేగం తగ్గింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆగర్-బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో ఎనిమిదో గేమ్‌లో సినర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ వెంటనే సెట్‌ను గెలుచుకుని మ్యాచ్‌ను సమం చేశాడు. రెండో సెట్ తర్వాత సినర్ మెడికల్ టైమౌట్ తీసుకుని చికిత్స కోసం లాకర్ రూమ్‌కు వెళ్లాడు. తిరిగి కోర్టులోకి వచ్చిన అతను పుంజుకున్నాడు. మూడో సెట్‌లో తన సహజమైన ఆటతీరును చూపెడుతూ11 విన్నర్లు కొట్టి, కేవలం 4 అనవసర తప్పిదాలు చేసి ఈజీగా సెట్ గెలిచాడు.నాలుగో సెట్‌లోనూ అదే జోరు కొనసాగించి యానిక్ ఆరంభంలో ఐదు బ్రేక్ పాయింట్లను కాపాడుకుని, ఆ తర్వాత ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 3–-2 ఆధిక్యం సాధించాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా సెట్‌తో పాటు మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు.
జొకోకు నిరాశే
గత సీజన్ యూఎస్ ఓపెన్‌లో రెండో రౌండ్‌లోనే వెనుదిరిగిన స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ ఈసారి ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. సెమీఫైనల్ మ్యాచ్‌లో నొవాక్ జొకోవిచ్‌ను చిత్తు చేసి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కేవలం 2 గంటల 23 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండో సీడ్ అల్కరాజ్ 6–-4, 7-–6(7/4), 6–-2 తో వరుస సెట్లలో ఏడో సీడ్ నొవాక్‌పై విజయం సాధించాడు. 2022లో ఇక్కడే తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచినప్పటి నుంచి అల్కరాజ్ తన ఆటతీరుతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నాడు. తాజా టోర్నీలో ఫైనల్ చేరే క్రమంలో ఆరు మ్యాచ్‌లు గెలవడానికి అతను కోర్టులో కేవలం 12 గంటలు మాత్రమే గడపడం అతని సామర్థ్యానికి నిదర్శనం. ఈ ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండు సర్వీస్ గేమ్‌లను మాత్రమే కోల్పోయాడు. జొకోతో సెమీస్‌లో రెండో సెట్‌లో మాత్రమే అల్కరాజ్ కాస్త కష్టపడ్డాడు. దీన్ని టై బ్రేక్‌లో నెగ్గిన అతను మూడో సెట్‌ను అలవోకగా గెలిచి 25వ గ్రాండ్‌స్లామ్ సాధించాలని ఆశించిన నొవాక్‌ను మరోసారి నిరాశకు గురిచేశాడు. ఈ మ్యాచ్‌లో ఏడు ఏస్‌లు కొట్టిన స్పెయిన్ స్టార్ 4 బ్రేక్ పాయింట్లు సాధించి 31 విన్నర్లు సంధించాడు. రెండు డబుల్ ఫాల్ట్స్, 30 అనవసర తప్పిదాలు చేశాడు. నాలుగు ఏస్‌లు, ఒక్క బ్రేక్ పాయింట్, 15 విన్నర్లకే పరిమితం అయిన నొవాక్ ఐదు డబుల్ ఫాల్ట్స్‌తో మూల్యం చెల్లించుకున్నాడు.