
25 ఏళ్ల యుటా శినోహరా ప్రేమలో పడ్డాడు. ఏడాది పాటు డేటింగ్ చేశాడు. కానీ, ప్రతీ లవ్ స్టోరీలోనూ విషాదం ఉంటుందన్నట్టుగా.. ఇతగాడి లవ్ స్టోరీలోనూ విషాదం ఉంది. అతడి లవర్ చచ్చిపోయింది. అలా అని అతడేం ఏడుస్తూ కూర్చోలేదు. హ్యాపీగా లవర్ ను తినేశాడు. అతడి లవర్ పేరు లీసా. కానీ, మనిషి కాదు. పుర్రెకో బుద్ధి అన్నట్టు అతడు ప్రేమించింది ఓ బొద్దింకను. అవును. ప్రేమ గుడ్డిదంటారు కదా.. అలాగే అతగాడికి ఆఫ్రికాకు చెందిన లీసా అంటే ప్రేమ పుట్టింది మరి.
జపాన్‌లోని ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు తన ప్రేమ గురించి చెప్పుకొచ్చాడు. తనను తినేయడం చాలా సంతోషాన్నిచ్చిందన్నాడు. ఎందుకయా అంటే .. శాశ్వతంగా అది తన కడుపులో ఉండిపోతుంది కదా అంటాడు శినోహరా. స్వతహాగానే అతడికి పురుగుపుట్ర అంటే ప్రేమ అట. ఆ ప్రేమతోనే బొద్దింకను ప్రేమించాడట. దానికి తోడు స్వామి కార్యం కూడా పూర్తవుతదంటున్నాడు. ఎందుకంటే ఆహార భద్రత కోసం ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో).. పురుగులను తినండని చెబుతోంది కదా. ఆ మాట పట్టుకున్న అతడు.. పురుగుల భోజనంపై ప్రచారాలూ చేస్తున్నాడు. దేశంలో రెస్టారెంట్లలో ఆ ఫుడ్డును ప్రమోట్ చేస్తున్నాడు.