కరోనాపై పోరు: కలసి నడుద్దాం అంటున్న జపాన్, అమెరికా

కరోనాపై పోరు: కలసి నడుద్దాం అంటున్న జపాన్, అమెరికా

ఫోన్ లో షింజో అబేతో ట్రంప్ చర్చలు
టోక్యో: కరోనా వైరస్ పై పోరులో ఉమ్మడిగా కలసి ముందుకు నడవడానికి జపాన్, అమెరికాలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు మహమ్మారిని ఎదుర్కోవడానికి మందులు, వ్యాక్సిన్ల అభివృద్ధి కోసం కలసి ముందుకెళ్లాలని జపాన్ ప్రధాని షింజో అబే, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారని జపాన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ట్రంప్, అబే మధ్య దాదాపు 45 నిమిషాల పాటు ఫోన్ లో చర్చలు జరిగాయని జపాన్ చీఫ్ కేబినెట్ సెక్రటరీ యోషిహిడే సుగా చెప్పారు.

‘ఇరు నేతలు రెండు దేశాల్లో కరోనా వల్ల నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించారు. మున్ముందు వైరస్ తీవ్రత పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, మెడిసిన్స్, వ్యాక్సిన్ అభివృద్ధిపై మాట్లాడారు. అలాగే ఎకానమీని మళ్లీ రీఓపెన్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి కూడా ప్రస్తావించారు’ అని సుగా పేర్కొన్నారు. జపాన్, అమెరికాల మధ్య సహకారాన్ని ఇలాగే కొనసాగించాలని షింజో, ట్రంప్ లు అంగీకరించారని సుగా వివరించారు.