కరోనా ఎఫెక్ట్ : తీరంలో ప్రయాణికుల నౌకను నిలిపివేసిన జపాన్‌

కరోనా ఎఫెక్ట్ : తీరంలో ప్రయాణికుల నౌకను నిలిపివేసిన జపాన్‌

చైనా దేశంతో పాటు అనేక దేశాలను వణికిస్తోంది కరోనా వైరస్. చైనా నుంచి ఎవరైనా తమ దేశంలోకి వచ్చారని తెలిస్తే చాలు ఆయా దేశాలు హడలిపోతున్నాయి. వచ్చిన ప్రయాణికులకు మెడికల్ టెస్టులు నిర్వహించిన తర్వాతనే దేశంలోకి అనుమతిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో 3711 మందితో ఉన్న ఓ ప్రయాణికుల నౌకను జపాన్‌ తీరానికి అనుమతించకుండా అక్కడే నిలిపివేంది. ప్రయాణికుల్లో కరోనా బాధితులు ఉన్నారన్న సమాచారంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో నౌకలో 2,666 మంది ప్రయాణికులు, 1045 మంది సిబ్బంది ఇప్పటికి 24 గంటలుగా దిక్కుతోచని స్థితిలో అందులోనే ఉండిపోయారు. అందరికీ మెడికల్ టెస్టులు నిర్వహించిన తర్వాతనే వారిని బయలకు పంపిస్తామని అధికారులు తెలిపారు.

జపాన్‌కు చెందిన ఈ క్రూయిజ్‌ షిప్‌ నిన్న యొకొహోమా తీరానికి చేరుకుంది. అయితే ప్రయాణికుల్లో కొందరు కరోనా బాధితులు ఉన్నారన్న వార్తతో వైద్యాధికారులు తీరంలో నిలిపి ఉంచిన నౌకలోకి వెళ్లారు. పరీక్షలు నిర్వహించగా హాంకాంగ్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధునికి వైరస్‌ సోకినట్లు నిర్థారించారు. దీంతో అధికారులు ప్రయాణికులు ఎవరూ నౌక నుంచి ఒడ్డుకు వచ్చేందుకు అనుమతించడం లేదు.