- జపాన్ లో వరుసగా 10 రోజులు పబ్లిక్ హాలీడే
- ‘మాకొద్దు బాబూ’ అంటున్న ఉద్యోగులు
ఓ రెండు మూడు రోజులు వరుసగా సెలవులొస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తరు. ఏడికి పోవాలి,ఎవర్ని కలవాలి, ఎలా ఎంజాయ్ చేయాలి అని ముందు నుంచే ప్లాన్ చేసుకుంటరు. మళ్లీ సెలవులంటేనే ‘మొహం కొట్టేలా ’ ఎంజాయ్ చేస్తరు. అదేందో జపాన్‌లో పది రోజులు సెలవులొచ్చినా ఎందుకు రాబాబూ అనేస్తున్నరు. ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు ఆ దేశ ప్రభుత్వం సెలవులిచ్చింది. ‘ఇస్తే ఇచ్చిం డ్రు.వరుసగా పది రోజులివ్వాలా ’ అని అడుగుతున్నరు.‘ఈ పది రోజులు సచ్చినం పో’ అంటున్నవాళ్లూ ఉన్నరు. ఎందుకంటరు?
ఇదీ గోల్డెన్ వీక్ ఆఫ్ అంటే
జపాన్‌లో ‘గోల్డెన్ వీక్ ఆఫ్’ అని వారం రోజులు సెలవులుంటాయి. ఆ దేశ రాజు షోవా పుట్టిన రోజు నుంచి చిల్డ్రన్స్ డే వరకు వారం పాటు సెలవులిస్తారు. ఈ బంగారు అవకాశాన్ని సిని మాలు చూడటానికి వాడుకోవాలని అప్పట్లో మూవీ కంపెనీలు బాగా ప్రచారం చేశాయి. తర్వాత ఇది అందరి పదమైపోయింది. అయితే వారం సెలవులను ఈఏడాది పొడిగించారు. రాజు అకిహిటో రిటైర్మెంట్, తన కొడుకు నరుహిటో పట్టాభిషేకం ఉండటంతో మరో మూడు రోజులు పెంచారు. కానీ పది రోజులు సెలవులిచ్చినా జపాన్ ఉద్యోగుల్లో సగం మంది సంతోషంగా లేరని ఎక్స్‌పీడీయా సర్వేలో వెల్లడైంది. ఇంటిపట్టున ఉండే మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులుకూడా సెలవులపై నిరుత్సాహంగా ఉన్నారని అసాహి న్యూస్‌పేపర్ చేసిన సర్వేలో తేలింది. ‘ఈ సెం చరీలోనే ఇది పిచ్చి ఐడియా. డబ్బున్నోళ్లే ఎక్కువ సంతోషంగా ఉంటారు. పది రోజులు వరుస సెలవులివ్వొద్దు’ అన్న ఉద్యోగులూ ఉన్నారు. రవాణా ఖర్చులు పెరగడం,టూరిస్టు ప్రాంతాల్లో రద్దీ ఎక్కువవడం, బ్యాంకులు, చైల్డ్‌కేర్ సెం టర్లు మూసేయడం, సెలువున్నా సర్వీస్ రంగంలో పని చేయాల్సి ఉండటం.. ఒకటేమిటీ చాలా సమస్యలు వివరిస్తున్నారు ఉద్యోగులు.
ఆఫ్ లే లేవు.. ఇంకా సెలవులా?
జపాన్‌లో ఉద్యోగులకు సరైన సమయానికి వీక్ ఆఫ్‌లు రావడం లేదు. సరైన లేబర్ ఫోర్స్ లేక ఆఫీస్ టైం అయిపోయినా కూడా పని చేయాల్సి వస్తోంది. సర్వీస్ రంగంలో పని చేసే వారి సమస్యలైతే చెప్పనక్కర్లేదు. సెలవులున్నా పని చేయాల్సిం దే. ఇక, ఇప్పటికే టూర్లకు వెళ్లే వాళ్లతో విమానాలు, హోటళ్లూ ఫుల్ అయిపోయాయి. కార్లలోనూ వెళుతున్న వారుండడంతో హైవేలపై ట్రాఫిక్ పెరిగింది. సెలవుల వల్ల విమాన టికెట్ ధరలు, హోటల్ రూం ల రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో కొందరు టూర్లను రద్దు చేసుకుంటున్నారని సర్వేలో తేలింది. బయట రద్దీ పెరుగుతుందని, అంత రద్దీలో తాము ఎంజాయ్ చేయలేమని ఇంకొం దరు చెప్పారు. హౌస్‌వైఫ్స్ కూడా ఎలాంటి ప్లాన్లు చేసుకోలేదని తెలిసింది. ఇంటిపని, వంట పని, ఇతరత్రా పనుల్లో తాము బిజీ అని చెప్పేశారు. ఇంకొందరు పది రోజులు రోడ్లపై ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని భయపడుతున్నారు. ఆ రోజుల్లోడబ్బులు నీళ్లలా ఖర్చవుతాయని చెబుతున్నారు. సెలవుల్లో చైల్డ్ కేర్ సెంటర్లు ఈ పది రోజులు మూసేస్తారు. సెలవులున్న ఉద్యోగులకు ఇదేం పెద్ద సమస్య కాదు కానీ సెలవుల్లేని సర్వీస్ ఉద్యోగులకే చాలా కష్టం .
మాకెక్కడి సెలవులండీ
సెలవుల గురించి ఓ హోటల్‌లో పని చేసే ముప్పై ఏళ్ల మహిళ మాట్లాడుతూ.. ‘మాకెక్కడి సెలవులండీ. పది రోజులు హోటల్ బిజీ.అన్ని రూం లు బుక్కయ్యాయి. ప్రభుత్వం సెలవులివ్వాలనుకుం టే సర్వీస్ రంగంలోని వాళ్లను కాస్త చూసి ఇవ్వాలి. మేం సెలవులు తీసుకోవద్దా . సెలవుల్లో పని చేస్తున్నందుకు కనీసం జీతమైన పెంచుతారనుకుంటున్నా’అన్నారు. ఇంకొందరేమో హాలీడే అయిపోయాక పరిస్థితేంటని భయపడుతున్నారు. పని పెరిగిపోతుందని కంగారు పడుతున్నారు. ఇక,జపాన్ మొత్తం లిక్విడ్ కరెన్సీ మీదే నడుస్తుంది. ఇప్పుడు బ్యాంకులకూ మే 6 వరకు సెలవులు. ఇప్పటికే ఏటీఎంలలో డబ్బు ఖాళీ అవుతోంది. దీంతో , టూర్లకు వెళ్లే వాళ్లు ముందే డబ్బును డ్రా చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే డబ్బు కష్టాలు తప్పవని అంటున్నారు కొందరు జనం.