హోలీ వేడుకల్లో జపాన్ యువతికి వేధింపులు

హోలీ వేడుకల్లో జపాన్ యువతికి వేధింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ఆకతాయిల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. మహిళలు, యువతుల పట్ల కొందరు యువకులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన హోలీ వేడుకల్లో ఓ యువతి పట్ల  కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. జపాన్కు చెందిన యువతికి బలవంతంగా రంగులు పూశారు. ఆమె తలపై గుడ్టు పగులకొట్టారు. ప్రస్తుతం  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

హోలీ వేధింపులు..

బుధవారం ఢిల్లీలోని పహర్ గంజ్లో  కొందరు యువకులు హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సమయంలో అటుగా వచ్చిన జపాన్కు చెందిన యువతిపై హోలీ వేడుకల పేరుతో యువకులు వేధించారు. బలవంతంగా ఆమెకు రంగులు పూశారు. ఇష్టాను సారంగా ఒంటిపై రంగులు చల్లారు. బలవంతంగా యువతికి రంగులు పూయడమేగాక ఆమె తలపై కోడిగుడ్లు పగలగొట్టారు. వద్దంటున్నా శరీరాన్ని తాకడం వంటి వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. ఆకతాయిల నుంచి తప్పించుకుని వెళ్తున్న ఆమెకు మరో యువకుడు అడ్డొచ్చాడు. దీంతో అతని చెంప ఛెళ్లుమనించింది. అయినా అతడు ఆమె మొహంపై రంగుపూశాడు.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. 

మహిళా సంఘాల ఆగ్రహం..

ఈ దారుణ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ తీవ్రంగా స్పందించారు. ఈ వీడియోలను పరిశీలించి యువతిపై వేధింపులకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఒక మహిళ, అందునా విదేశీ యువతిపై ఈ విధంగా దాడికి పాల్పడటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. 

యువకుల కోసం గాలింపు..

ఈ వీడియోపై పోలీసులు విచారణ చేస్తున్నారు. వీడియో కొత్తదా పాతదా అని విచారిస్తున్నారు. యువతికి సంబంధించి మరిన్ని వివరాల కోసం జపాన్ రాయబార కార్యాలయానికి పోలీసులు ఈమెయిల్ చేశారు. అటు వీడియోలో ఉన్న యువలకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. యువతిని విచారించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.