టీమిండియా కొత్త వైస్ కెప్టెన్ గా జస్ప్రీత్‌ బుమ్రా!

టీమిండియా కొత్త వైస్ కెప్టెన్ గా జస్ప్రీత్‌ బుమ్రా!

శ్రీలంకలో జరిగే ఆసియా కప్‌ 2023లో భారత జట్టుకు జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్ గా నియమిస్తారని తెలుస్తోంది.   ప్రస్తుతం వైస్ కెప్టెన్ గా ఉన్న  హార్దిక్ పాండ్యాపై వేటు వేయనున్నట్లుగా సమాచారం.  ఆసియా కప్‌ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు అజిత్ అగార్కర్ అధ్యక్షతన సెలక్షన్ కమిటీ 2023 ఆగస్టు 21 సోమవారం మధ్యాహ్నం న్యూ ఢిల్లీలో సమావేశం కానుంది.  ఈ సమావేశానికి కోచ్ రాహుల్ ద్రవిడ్ , కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ హాజరుకానున్నారు. 

ద్రవిడ్‌ నేరుగా సమావేశంకు హాజరుకానుండగా.. రోహిత్ ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేరే అవకాశం ఉంది. ఈ సమావేశంలో బుమ్రాను వైస్ కెప్టెన్ గా నియమిస్తే హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్ తగిలినట్లే అవుతుంది.  కెప్టెన్సీ పరంగా చూస్తే పాండ్యా కంటే బెటర్ గా బుమ్రా ముందు వరుసలో ఉన్నాడని ఇప్పటికే బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.  

ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో కూడా బుమ్రా కెప్టెన్‌గా అద్భుత ప్రదర్శన చేశాడు.  డెత్ ఓవర్లలో ముఖేష్ కుమార్‌ను ఉపయోగించడం, అక్షర్ పటేల్‌ను బౌలింగ్ చేయించకపోవడం వంటివి విజయంలో కీ రోల్ పోషించాయి.  టీ20లో  విజయం సాధించినప్పటికీ జట్టులో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిపై దృష్టి సారించాలని బుమ్రా అన్నాడు. హార్దిక్ పాండ్యా ఓటమికి సరిగ్గా స్పందించలేక పోవడంతో బుమ్రా సరైన కెప్టెన్‌గా కనిపిస్తున్నాడు.