యువతులను డ్రగ్స్ ​ఊబిలోకి లాగేందుకు ఫ్రీ ఈవెంట్స్‌

యువతులను డ్రగ్స్ ​ఊబిలోకి లాగేందుకు ఫ్రీ ఈవెంట్స్‌

హైదరాబాద్‌, వెలుగు:  ముంబై డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా డ్రగ్స్​పెడ్లర్​ జతిన్​ బాల్​చంద్ర భలేరావు మొబైల్​ ఫోన్​ ను జల్లెడపట్టిన హైదరాబాద్​ నార్కోటిక్​ ఎన్​ఫోర్స్​మెంట్​ వింగ్​(హెచ్​ న్యూ) .. అతడు చేసిన ఎన్నో అకృత్యాలను గుర్తించింది.  జతిన్​ స్టార్​ హోటళ్లలో ఫ్రీ డ్రగ్​ ఈవెంట్స్‌ నిర్వహించి ఎంతోమంది యువతులు, విద్యార్థినులను వాటికి బానిసలుగా మార్చిన తీరు బయటపడింది. డ్రగ్స్‌ కోసం తన వద్దకొచ్చే యువతులను లోబరుచుకునే వాడని,  వాళ్ల న్యూడ్​ వీడియోలను ఫోన్ లో రికార్డ్​ చేసుకునేవాడని విచారణలో వెల్లడైంది. మేల్‌ డ్రగ్‌ కస్టమర్లకు అమ్మాయిలను ఎరగా వేసేవాడని.. వారు డ్రగ్స్ మత్తులో ఉన్న యువతులపై అత్యాచారాలు జరపడంతో పాటు శారీరకంగా హింసించేవారని తేలింది. డ్రగ్‌ పెడ్లర్‌‌ జతిన్‌ అరెస్ట్‌ అయిన తర్వాత కూడా యువతుల నుంచి అతడికి వరుస పెట్టి ఫోన్‌ కాల్స్ వచ్చాయి.  అతడు వేసిన డ్రగ్స్​ ఉచ్చులో యువతులు భారీ సంఖ్యలో చిక్కుకున్నారనే దానికి ఆ కాల్సే నిదర్శనమని పోలీసువర్గాలు అంటున్నాయి.  హైదరాబాద్‌కు  మీథైలీన్​డయాక్సీ మీథాంఫెటమైన్​ ( ఎండీఎంఏ) సప్లయ్‌ చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను మంగళవారం హెచ్‌ న్యూ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  

ప్రతినెలా మూడు నుంచి నాలుగు ఫ్రీ ఈవెంట్స్​.. 

మహారాష్ట్రలోని  థాణే జిల్లా మిరారోడ్డు ఏరియాకు చెందిన జతిన్​.. ఇంటర్​ దాకా చదువుకున్నాడు. కొంతకాలం ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేశాడు. మిరా రోడ్డు సముద్రతీర ప్రాంతం కావడంతో అక్కడ గత ఎనిమిదేండ్లుగా డ్రగ్స్‌ దందా చేస్తున్నాడు. ఇందుకోసం త్రీ స్టార్‌‌ హోటల్స్​లో షెల్టర్‌‌ ఏర్పాటు చేసుకున్నాడు. డ్రగ్స్‌ పెడ్లర్లు, కస్టమర్లతో డ్రగ్స్‌ వాట్సాప్‌ గ్రూప్ క్రియేట్‌ చేశాడు. ఇందులో పదుల సంఖ్యలో యువతులు,విద్యార్థినులు ఉన్నారు. తన నెట్‌వర్క్​లోని వారికి ఫ్రీ ఈవెంట్స్‌ నిర్వహించేవాడు. నెలలో మూడు నుంచి నాలుగు పార్టీలను ఏర్పాటు చేసేవాడు. పార్టీలో లిక్కర్‌‌, డ్రగ్స్‌ ఇచ్చేవాడు. స్టార్ హోటల్స్​లో పార్టీ కావడంతో యువత, మత్తు బానిసలు ఎక్కువ సంఖ్యలో  హాజరయ్యేవారు. ఈ ఈవెంట్స్​లో డ్రగ్స్​పెడ్లర్లు, సప్లయర్లు కీలకంగా వ్యవహరించేవారు. డ్రగ్స్ సహా అన్ని రకాల అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించేవారు. నైజీరియన్స్‌ నుంచి కొకైన్‌,చరస్‌,హెరాయిన్‌ కొని సప్లయ్ చేసేవారు. పాత కస్టమర్ల ద్వారా కొత్త కస్టమర్లను క్రియేట్‌ చేసుకునేవారు. ముంబయి డ్రగ్స్ మాఫియా మెంబర్స్ వికాస్‌ మోహన్ కొడ్మూరు, దినేష్‌ మోహన్‌ కొడ్మూరు వద్ద కిలోల కొద్దీ ఎండీఎంఏ కొనేవారు. 

జతిన్ సంపాదన.. ఏటా రూ.1.5 కోట్లపైనే

కొత్త కస్టమర్లకు ముందుగా రూ.1500 నుంచి రూ.3000కు డ్రగ్స్​ విక్రయించేవారు. డ్రగ్స్‌ తీసుకునేందుకు స్టార్​ హోటల్స్​ లో స్పెషల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసేవారు. ఇటువంటి టైంలోనే  డ్రగ్స్​కు  బానిసలైన యువతులు,విద్యార్థినులను జతిన్ టార్గెట్‌ చేసేవాడు. వారిని లోబరుచుకునేవాడు. మొబైల్‌ ఫోన్‌లో వారి న్యూడ్‌ వీడియోలను రికార్డ్ చేసేవాడు. మేల్‌ డ్రగ్‌ కస్టమర్లకు అమ్మాయిలను ఎరగా వేసేవాడు. ఈవిధంగా డ్రగ్స్​ దందా నడుపుతూ ప్రతి నెలా రూ.12 లక్షలను జతిన్​ సంపాదిస్తున్నాడు . 

15 మంది టీమ్​తో డెకాయ్​ ఆపరేషన్​.. 

జతిన్‌ నెట్‌వర్క్​లోని  హైదరాబాద్​కు చెందిన డ్రగ్​ పెడ్లర్​ సనాఖాన్‌ కస్టమర్ల ద్వారా హెచ్‌ న్యూ పోలీసులు నిఘా పెట్టారు. కస్టమర్లుగా మారిపోయి  డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు.ఇందుకోసం15 మంది పోలీసుల టీమ్​ రెండు నెలల పాటు శ్రమించింది. అజ్మీర్‌‌,రాజస్థాన్‌,ముంబైలలో తనిఖీలు చేశారు.