జవహర్ నగర్ మోడల్ స్కూల్ హాస్టల్ లో అన్ని సమస్యలే

జవహర్ నగర్ మోడల్ స్కూల్ హాస్టల్ లో అన్ని సమస్యలే
  • ఆకతాయిల వేధింపులంటూ బాలికలు ధర్నా
  • సీరియస్​ అయిన మంత్రి సీతక్క
  • హాస్టల్ ను తనిఖీ చేసిన డీఈవో, తహసీల్దార్​
  • కేర్​ టేకర్, ఏఎన్ఎం, వాచ్​ఉమెన్​ సస్పెన్షన్​

ములుగు, వెంకటాపూర్​ (రామప్ప), వెలుగు: మోడల్​హాస్టల్లో అన్నీ సమస్యలే. తమను పట్టించుకునే వారే లేరని, పోకిరీలు నాలుగు రోజులుగా హాస్టల్ కు వచ్చి వేధిస్తున్నారని, భయంగా ఉంటోందంటూ ములుగు జిల్లా వెంకటాపూర్​ మండలంలోని జవహర్​నగర్​ మోడల్ స్కూల్ కు సంబంధించిన హాస్టల్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి కొద్దిసేపు ధర్నా చేసిన విద్యార్థులు ఎస్సై చల్ల రాజు మాట్లాడటంతో విరమించుకున్నారు.

 ఆదివారం ఉదయం మళ్లీ హాస్టల్ వద్ద ధర్నాకు దిగారు. హాస్టల్ లో 73మంది విద్యార్థులు ఉండగా, 20మంది వివిధ ఆరోగ్య కారణాలతో ఇండ్లకు వెళ్లిపోయారు. మిగతా విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్​ ఫస్ట్, సెకండ్​ ఇయర్​ చదివే 53 మంది విద్యార్థులకు హాస్టల్​ వసతి కల్పించగా, మరో 20 మంది విద్యార్థులు దూర ప్రాంతంలో ఉండేవారికి 9, 10వ తరగతుల విద్యార్థులకు ప్రత్యేక అనుమతి కల్పించడంతో హాస్టల్​లో ఉంటున్నారు. ఇక్కడే కేర్​ టేకర్, ఏఎన్ఎం, వాచ్​ఉమెన్​ సరిగా పనిచేయకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పారు. హాస్టల్ తలుపులు సరిగా లేకపోవడం, పగిలి ఉండడం, గోడలు శిథిలావస్థలో ఉండడం, కొందరు ఆకతాయిలు రాత్రి సమయాల్లో వేధింపులకు గురిచేస్తుండటంతో చేసేది ఏమీలేక ధర్నాకు దిగినట్లు వివరించారు.

 విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. డీఈవో సిద్ధార్థ రెడ్డి, వెంకటాపూర్​ తహసీల్దార్ గిరిబాబు జవహర్​నగర్​ మోడల్​హాస్టల్ కు చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలపై ఆరా తీసి వెంటనే శానిటేషన్​ పనులు మొదలు పెట్టారు. భద్రతా అంశాలపై స్థానిక ఎస్సై చల్ల రాజుకు వివరించగా, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పెట్రోలింగ్​ నిర్వహిస్తామని చెప్పారు. సెక్యూరిటీ సైతం 
ఏర్పాటు చేస్తామన్నారు. 

కేర్​ టేకర్, ఏఎన్​ఎం, వాచ్​ఉమెన్​ సస్పెన్షన్..

హాస్టల్ ను సందర్శించిన డీఈవో, తహసీల్దార్​ హాస్టల్​ను తనిఖీ చేశారు. హాస్టల్ నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించిన కేర్​ టేకర్​ ఎ.కవిత, ఏఎన్ఎం డి.జ్యోతి, వాచ్​ఉమెన్​ టి.అంజలిని సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. 

అనంతరం చలికాలం దృష్ట్యా హాస్టల్‌లో వేడినీటి గీజర్లను ఏర్పాటు చేసి ప్లంబింగ్ పనులను రెండురోజుల్లో పూర్తి చేయాలని కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్​ లక్ష్మీని ఆదేశించారు. ఇతర సమస్యలను త్వరగా పరిష్కరించి వారంలోపు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సంబంధించిన అధికారులకు సూచించారు.