మెస్సీకి భారత T20 ప్రపంచ కప్ జెర్సీని బహుకరించిన జై షా

మెస్సీకి భారత T20 ప్రపంచ కప్ జెర్సీని బహుకరించిన జై షా

న్యూఢిల్లీ: ఇండియా పర్యటనలో ఉన్న అర్జెంటీనా స్టార్ ఫుట్‌‎బాల్‌‌‌‌ప్లేయర్ లియోనల్‌‌‌‌మెస్సీకి ఐసీసీ చైర్మన్ జై షా భారత టీ20 ప్రపంచ కప్ జెర్సీని బహుమతిగా ఇచ్చారు. ఈ జెర్సీపై మెస్సీ పేరుతో పాటు అతడి పుట్‎బాల్ జెర్సీ నెంబర్ (10) రాసి ఉంది. జెర్సీతో పాటు వరల్డ్ కప్‎లో భాగంగా ఇండియా, అమెరికా జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ టికెట్లను కూడా మెస్సీకి అందజేశాడు జై షా. 

ఇండియా గోట్ టూర్ 2025లో భాగంగా మూడు రోజుల (డిసెంబర్ 13,14, 15) పాటు మెస్సీ ఇండియాలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. మొదట కోల్‎కతా వెళ్లిన మెస్సీ అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్‎లో సందడి చేసిన తర్వాత ముంబై వెళ్లారు. ముంబై నుంచి సోమవారం (డిసెంబర్ 15) ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు  చేశారు. 

ఈ కార్యక్రమానికి ఐసీసీ చైర్మన్ జై షా, ఢిల్లీ సీఎం రేఖ గుప్తా, భారత ఫుట్‌బాల్ దిగ్గజం బైచుంగ్ భూటియా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెస్సీతో పాటు అతడి సహచర ప్లేయర్స్ లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌లకు భారత టీ20 ప్రపంచ కప్ జెర్సీలను అమిత్ షా బహుమతిగా ఇచ్చారు. జెర్సీలతో పాటు వరల్డ్ కప్‎లో భాగంగా ఇండియా, అమెరికా జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ టికెట్లను కూడా మెస్సీకి అందజేశారు. అనంతరం సెలబ్రిటీ మెస్సీ ఆల్ స్టార్స్, మినర్వా మెస్సీ ఆల్ స్టార్స్ మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. 

ఈ గేములో సెలబ్రిటీ మెస్సీ ఆల్ స్టార్స్ 6-0 తేడాతో ఓడిపోయింది. మరోవైపు ఫుట్‌బాల్ ఐకాన్‌ మెస్సీని ప్రత్యక్షంగా చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అరుణ్ జైట్లీ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా  ప్రేక్షకులను ఉద్దేశిస్తూ మెస్సీ మాట్లాడుతూ.. ఇండియాలో తనపై చూపించిన ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఇండియా పర్యటన ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇండియాకు మరొకసారి వస్తానని చెప్పారు.